27-05-2025 02:00:38 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపి మావోయిస్టుల(Maoists)తో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) కోరారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కార్పొరేట్ల తరపున తప్ప సామాన్యుల తరపున ఆలోచన చేయడం లేదన్నారు. అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతాం అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది తప్పితే ప్రస్తుత తరం తరపున ఆలోచన చేయడం లేదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ బహిరంగసభలో కేసీఆర్ మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతి చర్చలు చేయాలని కోరినట్లు గుర్తు చేశారు.
మన దేశ పౌరులను మనమే కాల్చుకోవడం మంచిది కాదని కేంద్రానికి వివరించిన వారు ఎందుకో ఈ దిశగా ఆలోచించడం లేదని వాపోయ్యారు. వ్యవస్థలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి వాటిని సహించం అనడం మంచి పద్దతి కాదన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను ఏరివేస్తాం అన్న నిర్ణయం సరికాదని, వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఆలోచనలను నిర్మూలించలేరు. ఉన్నత విద్యావంతులు ఎంతో మంది అటు వైపు ఆకర్షించబడుతున్నారన్న విషయం ఎందుకు కేంద్రం ఆలోచించడం లేదు..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడ చంపుతున్న జ్ఞాన సంపదను తిరిగి మనం ఎలా సాధించగలం..?, 22 విద్యార్థి సంఘాలు, అనేక పార్టీలు, ప్రజాసంఘాలు చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు.
ఉగ్రవాద మూకలను ఏరి వేయాలని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఏకతాటిపై నిలబడి కేంద్రానికి, మన సైన్యానికి మద్దతు ఇచ్చింది, కానీ అమెరికా అధ్యక్షుడు రెండు దేశాలను ఒప్పించి కాల్పుల విరమణకు ఒప్పించాం అని ప్రకటించాడని తెలిపారు. మరి దేశంలోని మావోయిస్టులతో ఎందుకు కేంద్రం చర్చలు జరపడం లేదు..? మావోయిస్టుల మూలంగా అభివృద్ధి ఆగిపోయింది అన్న వాదన అసంబద్దమైనదని, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నాలుగు దశాబ్దాల మావోయిస్టులు ఉన్నారు. అంతకుముందు మూడు దశాబ్దాలు అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నారు..?అని అడిగారు. తుపాకికి తుపాకి, రక్తానికి రక్తం జవాబు కాదు.
తెలంగాణలో సాగునీళ్ల రాకతో ఉపాధి కల్పన పెరగడం, ప్రజల చేతికి పని రావడంతో ఇక్కడ మావోయిస్టులకు పనిలేకుండా పోయిందని, ఇక్కడ అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్ కౌంటర్ ఎందుకు జరగలేదు..? ఎందుకు నక్సలిజం విస్తరించలేదు..? అని ప్రశ్నించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా భావించి ప్రజల అవసరాలను తీర్చి పరిష్కారం చూయించామని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం ఉన్న దేశాలలో పోటీ పడి ఆర్థిక సంపదను పెంచుకుని, ప్రజల పాత్రను, ఆస్తులను పెంచిన దేశాలు ఆర్థికమాంద్యాలను తట్టుకుని నిలబడుతున్నాయని ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు.