27-05-2025 12:57:16 PM
అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మాస్టర్ జి
సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి మాస్టర్ జి ప్రారంభించి మాట్లాడారు. బడుగు బలహీనుల బతుకులు మారాలంటే రాజకీయ పార్టీలకు బానిసలుగా మారకూడదన్నారు. భారతదేశ సంపదను సృష్టించిన వర్గం నేడు బానిసలుగా మారిపోయిందని సూచించారు.
మనువాదులు సమాజాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మం పాటించాలంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఆ ధర్మంలో భర్త చనిపోతే అదే చితిలో భార్యను కూడా తగలబెట్టాలని ఉందనీ, మరి ఆ ధర్మాన్ని పాటించేవారు ఆ నియమాన్ని కూడా పాటిస్తారా అని ప్రశ్నించారు. కొందరు జనవాదులు ఉన్నారని అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే విధంగా పనిచేస్తారని చెప్పారు. అందుకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిదర్శనం అంటూ వివరించారు.
నేటి యువత బాబాసాహెబ్ ను అనుసరించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పేద పిల్లలు విదేశాలలో చదువుకోవడానికి అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ఏర్పాటు చేసి అనేక మందిని ఉన్నత విద్య చదివేందుకు కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.