26-09-2025 12:21:03 AM
జాతీయ ర్యాంకుల్లో నిర్మల్ ఘనత
కోటి రూపాయల నగదు బహుమతి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దేశవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించింది. నీటి సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి చేసి, జల్ సంచయ్ – జన భాగిధారి కార్యక్రమంలో జాతీయ స్థాయిలో వర్గం–2 (Category–2)లో రెండవ ర్యాంక్ సాధించింది. ఈ ప్రతిష్టాత్మక విజయంతో పాటు జిల్లాకు ఒక కోటి రూపాయల నగదు బహుమతి లభించడం గర్వకారణంగా నిలిచింది.
జల సంరక్షణలో భాగంగా చెరువులు, వాగులు, వానజల హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్‌డ్యాంలు నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టడం, భూగర్భజలాలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడం నిర్మల్ జిల్లాకు ఈ జాతీయ గుర్తింపుని తెచ్చిపెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక సంస్థల సమన్వయం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని కేంద్ర పరిశీలక బృందం నివేదికలో పేర్కొంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఇది నిర్మల్ జిల్లా ప్రజల కృషి, నిబద్ధతకు నిదర్శనం. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందరూ కలసి నీటి సంరక్షణలో చేసిన కృషి ఫలితమే ఈ జాతీయ ర్యాంక్. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి రంగాల్లో జాతీయస్థాయిలో అగ్రస్థానం సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు ప్రజల భాగస్వామ్యం జతకలిసినప్పుడు ఎలా ఫలితాలు వస్తాయో నిర్మల్ జిల్లా మరోసారి నిరూపించింది. ఈ జాతీయ పురస్కారం జిల్లాకు గౌరవాన్ని మాత్రమే కాక, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రేరణనిచ్చేలా నిలుస్తుందని తెలిపారు.