18-11-2025 12:12:18 AM
-పదోసారి ఆ కుర్చీ దక్కించుకున్న నేతగా రికార్డు
-పాట్నాలోని గాంధీ మైదానంలో వేడుక
-హాజరు కానున్న పీఎం మోదీ
పాట్నా, నవంబర్ 17: జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఈనెల 20న బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదోసారి సీఎం పీఠాన్ని అధిరోహించి సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరు కానున్నారు.
కాగా, ఈమేరకు సోమవారం ఆయన గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను కలిసి, ప్రస్తుత అసెంబ్లీని నవంబర్ 19 నుంచి రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని సమర్పించారు. మంగళవారం ఈ మేరకు ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కూటమి ఈ సమావేశంలో నితీశ్ కుమార్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటుపై చర్చిస్తారు.