calender_icon.png 17 January, 2026 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్‌పై సైనిక దాడి వద్దు!

17-01-2026 04:08:47 AM

  1. అమెరికాపై గల్ఫ్ దేశాల ఒత్తిడి
  2. దాడి చేస్తే చమురు సరఫరా నిలిచిపోతుందని స్పష్టీకరణ
  3. మధ్యప్రాచ్యంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని ఆవేదన
  4. ఈ దౌత్యంతో కాస్త వెనక్కి శాంతించిన అమెరికా
  5. తగ్గిన ఇరాన్ ప్రభుత్వమూ.. 800 మందికి ఉరిశిక్షల నిలిపివేత 

టెహ్రాన్/ వాషింగ్టన్: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గల్ఫ్ దేశాలు దౌత్యపరంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరాన్ పౌరుల నిరస నలను అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రమైన బలప్రయోగం చేస్తుండటం, ఆ ఊచకోతలో ౨,6౦౦ మందికి పైగా మరణించడంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించడంతో ఇరాన్‌పై యుద్ధమేఘాలు కుమ్ముకున్నాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శాంతిభద్రతలను దెబ్బతీస్తాయ ని భావించిన సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్‌తో పాటు గల్ఫ్ దేశాలు దౌత్యపరంగా పావులు కదుపుతున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్ట్ కూడా ఉంది.

మూడు రోజుల నుంచి ఆ దేశాల ప్రభుత్వాధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరాన్‌పై సైనిక దాడులు చేయొద్దని అమెరికా ప్రభుత్వ పెద్దలను పదే పదే కోరుతున్నాయి. అమెరికా ఒకవేళ ఇరాక్‌పై దాడులు జరిపితే చమురు సరఫరాకు ఆటంకం కలగడమే కాకుండా, తమ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎదు రుదాడి చేసే ప్రమాదం ఉందని అభ్యంతరం తెలుపుతున్నారు. ఇక సౌదీ అరేబియా అయి తే ఒక అడుగు ముందుకు వేసి ఇరాన్‌పై దాడులకు తమ గగనతలాన్ని ఉపయోగించడానికి వీల్లేదని అమెరికాకు తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఇరాన్ ఇప్పటికేతమపై దాడి చేస్తే గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలను తుదముట్టిస్తామని ప్రకటించిన సంగతీ, దీనిలో భాగంగానే ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ నుంచి అమెరికన్ సైన్యం వెనుదిరిగిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల దౌత్యం కారణంగా సైనిక దాడి విషయంలో అమెరికా కాస్త వెనుకడుగు వేసిందని పెంటగాన్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. సైనిక చర్య ఉండదని మాత్రం ట్రంప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఇరాన్ కూడా కాస్త వెనక్కి తగ్గింది. 800 మంది నిరసనకారులకు అమలు చేయాలనుకున్న ఉరిశిక్షలను సైతం నిలిపివేసింది. దీనిలో భాగంగానే 26 ఏళ్ల ఎర్ఫాన్ సోల్తానీ అనే యువకుడి ఉరిశిక్షను కూడా వాయిదా వేసినట్లు సమాచారం.