calender_icon.png 8 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేయని నిఘానేత్రాలు

07-01-2026 12:00:00 AM

  1. ఖరీదైన కెమెరాలు.. కానరాని ఫలితాలు 
  2. నిర్వహణ లేక వృథాగా మారిన వైనం
  3. ‘పోలీసు నిఘాకు ‘సాంకేతిక’ విఘాతం

నంగునూరు, జనవరి 6: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం‘ అని పోలీసు శాఖ గట్టిగా చెబుతుంటుంది. ఆ దిశగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా వాటి నిర్వహణ బాధ్యతను పర్యవేక్షించే వారు లేక మూలకు పడ్డాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మాత్రం ఆ నిఘా నేత్రాలకు చూపు ఆనడం లేదు. ఏర్పాటు చేసినప్పుడు ఉన్న ఉత్సాహం వాటి నిర్వహణలో కనిపించకపోవడంతో, గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ కరువవుతోంది.

అలంకారప్రాయంగా మారిన కెమెరాలు..

మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు గతంలో పలు గ్రామాల్లో రాజగోపాలపేట పోలీసుల ఆధ్వర్యంలో దాతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారుల సహకారంతో సుమారు 210 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ స్టేషన్లకు, గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేశారు. అయితే ప్రస్తుతం వీటిలో చాలా కెమెరాలు సాంకేతిక కారణాల వల్ల మూలకు పడ్డాయి. ముఖ్యంగా కోతుల దాడి వల్ల తీగలు తెగిపోవడం, వర్షాలకు పాడవ్వడం వంటి కారణాలతో ఇవి పనిచేయడం లేదు. వీటిని పర్యవేక్షించే సిబ్బంది లేకపోవడంతో ఏవి పని చేస్తున్నాయో, ఏవి అలంకారప్రాయంగా ఉన్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

సవాలుగా మారిన దర్యాప్తు..

గ్రామాల్లో నిఘా వ్యవస్థ నీరసించడంతో నేరగాళ్లకు అడ్దులేకుండా పోతోంది. కీలక సమయంలో సీసీ ఫుటేజీ లభ్యం కాకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

రక్షణ బాధ్యతలో భాగస్వాములు కండి.

పనిచేయని కెమెరాలను గుర్తించి, వాటికి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొత్తగా కెమెరాలను ఏర్పాటు చేశాం. గ్రామాల రక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి. ప్రజలు ఆందోళన చెందవద్దు, రాత్రిపూట పెట్రోలింగ్  పెంచుతున్నాం.

 టి.వివేక్, ఎస్‌ఐ, రాజగోపాలపేట