calender_icon.png 26 November, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 25 బీసీలకు చీకటి రోజు

26-11-2025 12:00:00 AM

రిజర్వేషన్లను రాజకీయంగా ఊచకోత కోశారు 

బీసీలు సర్పంచులు కాకుండా కుట్ర

  1. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఉద్యమాన్ని ఆపం
  2. ఈ నెల 30న హైదరాబాద్‌లో బీసీల యుద్ధభేరి 
  3. డిసెంబర్ 8, 9న పార్లమెంట్ ముట్టడి
  4. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

ఖైరతాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): నవంబర్ 25 బీసీలకు చీకటి రోజు అని, రొటేషన్ పేరున బీసీ రిజర్వేషన్లను రాజకీయంగా ఊచకోత కోశారని బీసీ జేఏ సీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు ఏమో గానీ, గత పంచాయతీ ఎన్నికలకన్నా ఇప్పు డు జరిగే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో బీసీలకు రిజర్వు కావలసిన వందలాది సర్పంచ్ స్థానాలను జనరల్ స్థానాలకు మళ్లించి బీసీలు సర్పంచులు కాకుండా కుట్ర చేశారని ఆరోపించారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో 40 కుల సంఘాలు 30 బీసీ సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా 18 శాతంకు తగ్గించి బీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం చేశారని కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలకు గాను 42% ప్రభుత్వం అమలు చేస్తే 5,300 పైగా గ్రామపంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ పొందే వారిని, ఇప్పుడు 18% రిజర్వేషన్ అమలు చేయడం మూలంగా బీసీలకు కేవలం 2,500 సీట్లు మాత్రమే రిజర్వ్ చేశారని చెపాపరు.

గత 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల కంటే ప్రస్తుతం జరిగే ఎన్నికలలో 600 సీట్లను తగ్గించారని పేర్కొన్నారు. 30 మండలాలలో ఒక్క గ్రామం కూడా బీసీ రిజర్వ్ చేయలేదని, సుమారు 80 మండలాల్లో ఒకటి రెండు గ్రామాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ చేశారని, బీసీలకు రావలసిన రిజర్వేషన్ జనరల్‌కు కేటాయించి తెలంగాణలో రెడ్డిల పాలనలో పునాదులు వేయడానికి అర్థం చేశారని ఆరోపించారు.

42 శాతం బీసీలకు చట్టబద్ధంగా ఇస్తామని నమ్మించి నవంబర్ 25న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజును బీసీలకు చీకటి రోజుగా, నమ్మక ద్రోహ దినంగా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినా బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. ఈ నెల 30న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తున్నామని, డిసెంబర్ 8, 9తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చి, పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముది రాజ్, బిసి విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.