14-10-2025 01:04:35 AM
కేయూ వైస్ చాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి వెల్లడి
కాకతీయ యూనివర్సిటీ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): విద్యార్థుల్లో అకాడమిక్ నైపుణ్యాలతో పాటు జీవ, జీవన, వ్యక్తిత్వ నైపుణ్యాల అభివృద్ధికి విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు. విశ్వ విద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో హైదరాబాద్, తెలంగాణా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (న్యాస్కం) సంస్థతో ఒక సంవత్సరం కాలానికి అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలపై శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థులు వివిధ సాంకేతిక రంగాలలో సర్టిఫికేషన్లు పొందటమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకునే అవకాశం కలుగుతుందని వీసీ తెలిపారు. అదే విధంగా కాకతీయ విశ్వవిద్యాలయం హార్ట్ఫుల్నెస్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒక సంవత్సరం కాలానికి అవగాహన ఒప్పందం (ఏం.ఓ.యు) కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా కేయూ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక, భావోద్వేగ అభివృద్ధికి తోడ్పడే అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులలో జీవిత నైపుణ్యాలు, విలువలు, ఆత్మవిశ్వాసం, మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో బాటు ధ్యానం, యోగా, పాలారిటీ టెక్నిక్స్, డీ-అడిక్షన్ శిక్షణలు, శాస్త్ర సాంకేతికత, కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యక్రమాలు, అధ్యాపకుల కోసం ప్రత్యేక శిక్షణలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆయా సంస్థల ప్రతినిధులు, సైన్సు విభాగాల డీన్ ఆచార్య జి.హనుమంత్, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు, ఆచార్య వాసుదేవ రెడ్డి, ఆచార్య మల్లికార్జున రెడ్డి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి, సహాయ రిజిస్ట్రార్ డాక్టర్ కోలా శంకర్, డాక్టర్ బొల్లం కిరణ్, డాక్టర్ సిద్ధార్ధ, విశ్రాంత ఆచార్యులు ఆచార్య జి.దామోదర్, ఆచార్య జి.అచ్చయ్య, హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ బాధ్యులు డాక్టర్ అనంత మాధవ మోహన్ తదితరాలు పాల్గొన్నారు.