05-05-2025 02:17:42 AM
రెండు అక్రమ నిర్మాణాలను కూల్చేసిన తాండ యువకులు
కుత్బుల్లాపూర్, మే 4 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం తండా లో తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను యువకులు కూల్చివేశారు. క్రీడా ప్రాంగణం కబ్జాకు గురవుతుందని యువకులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో యువకులే అక్రమ కట్టడాలను కూల్చివేశారు..
లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతుండడంతో తామే ఈ పని చేశామని యువకులు కరాకండిగా చెప్తున్నారు. దుండిగల్ మండలం తండా-2 లో ప్రభుత్వ సర్వే నంబర్ 684లో స్థానిక నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి క్రీడా ప్రాంగణం ప్రభుత్వం స్థలం కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు తెరలేపాడు. తనకు పాత ఇంటి నెంబర్లు ఉన్నాయని ఆ నంబర్ల ఆధారంగానే నిర్మాణాలను చేపడుతున్నానని ఎక్కడివో నెంబర్ లు ఇక్కడ చూపిస్తూ మేక పోతు గంభీర్యం ప్రదర్శిస్తూ తన పలుకుబడి ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన యూత్ యువకుల పై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో సంఘటన స్థలానికి పోలీసులు రావడంతో తండా యువకులు మేమేం ఏమి తప్పు చేశాము,గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం మంజూరు చేసిందని ఇప్పుడు అది కబ్జా అవుతుందని అధికారులకు తెలిపామన్నారు. అయినా వారు కబ్జాల పై చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు చేయవలసిన పని మేం చేసాము అంటూ పోలీసులకు సైతం స్పష్టంగా వివరణ ఇచ్చారు.ఇప్పుడు రెవెన్యూ అధికారులు కబ్జా దారుడు పై చర్యలు తీసుకుంటారా..?
లేక తూతూ మంత్రపు చర్యలు చేపట్టి మమ అనిపిస్తారా..? మంచి పని చేసిన యువకుల మీద కేసులు పెడుతామని, బెదిరిస్తున్నారని యువకులు తెలిపారు. ఒకవేళ యువకుల మీద కేసులు నమోదు చేస్తే సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ తో పాటు, సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు న్యాయ పోరాటం చేస్తామని యువకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.