05-05-2025 02:17:29 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణకు వడగాలుల ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రకృతి వపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరించింది. రాష్టవ్యాప్తంగా 1,089 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేసి గంట గంటకు ఉష్ణోగ్రతలను రికార్డు చేస్తున్నామని, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ప్రతి 2 చదరపు కిలోమీటర్లకు ఒక స్టేషన్ అందుబాటులో ఉందని వెల్లడించింది.
వాట్సప్, ఈ సంక్షిప్త సందేశాల ద్వారా వెంట వెంటనే యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నది. ప్రధాన కూడళ్లు, కలెక్టరేట్లలో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి మరీ వాతావరణ సమాచారాన్ని ప్రదర్శిస్తున్నామని తెలిపింది. తాజాగా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తూ ప్రజాసంక్షేమార్థం కీలక సూచనలు జారీ చేసింది.
ప్రధానంగా నల్లగొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వడగాడ్పుల ప్రమాదం ఉందని ఆయా జిల్లాల్లో జూన్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
తల్లిదండ్రులను చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు రావాలని పేర్కొన్నది.
11 ఏళ్లలో మరణాల సంఖ్య ఇలా..
గడిచిన 11 ఏళ్లలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఏటా సగటున 10 కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచాయి. మిగిలిన జిల్లాల్లో సగటున 5 9 రోజుల మధ్య వడగాడ్పులు నమోదయ్యాయి. 2015లో 358 రోజులు వడగాలులు వీచి, వడదెబ్బ తగిగి 541 మంది మృతిచెందారు. అలాగే 2016లో 488 రోజులకు 324 మరణాలు, 2017లో 89 రోజులకు 108 మరణాలు, 2019లో 161 రోజులకు 64 మరణాలు సంభవించాయి.