18-08-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖలో కమీషన్ల కోసమే ప్రమోషన్లు ఇవ్వకుండా కొందరు అధికారులు కుట్ర చేస్తున్నారని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డా.రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. కమిషనర్ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాలో ఇన్ని ఖాళీలుంటే కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ మేరకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజా ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రమోషన్లు, బదిలీలలతో సంతోషంగా ఉంటే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మాత్రం ప్రమోషన్లు, బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. డిపిసి గడువు ఈనెల 31 వ తేదీకి ముగుస్తుందని, అంతలోపు పదోన్నతులు ఇవ్వకుంటే మళ్ళీ ఏడాది సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మూడు డిపార్టుమెం ట్లు వెరిఫై చేసి పంపి నెల రోజులు కావస్తున్నా, మంత్రి ఓఎస్డీ అడ్డు పడుతున్నారన్న సమాచారం తమకుందన్నారు.
డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లుగా అయితే లంచాలు రావని మంత్రి సంతకం కాకుండా ఓఎస్డీతో చెప్పిస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటి కమిషనర్లు రెండు, మూడు పోస్టులలో ఇంచార్జీలుగా పని చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఒక్క రోజులోనే ఫైల్ క్లియర్ చేసి పంపిస్తుంటే మంత్రి పేషీలో మాత్రం నెల రోజులు కావస్తున్నా క్లియర్ చేయడం లేదన్నారు.
రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ల పోస్టింగులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. 8 ఏళ్లుగా బదిలీలు జరగక ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. జెఎసి నాయకులు గోటూరి రవీందర్ గౌడ్, గాలిగల్ల సాయిబాబా, రేనట్ల మల్లేష్, దివాకర్ గౌడ్, యశ్వంత్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.