07-11-2025 04:57:32 PM
మర్పల్లి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నోచుకోలేదు. పల్లె ప్రగతిలో భాగంగా ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో స్థలం కొరతతో ఊరు బయట ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో, మరికొన్ని చోట్ల లోని భూముల్లో బోర్డులు పెట్టి ఇదే క్రీడా ప్రాంగణం అంటూ అధికారులు చేతులు దులుపుకొన్నారు. అయితే అవి ఇప్పుడు కానరాకుండా పోయాయి. కేవలం ఇనుప బార్లు మాత్రమే మిగిలాయి. మండలంలో నీ అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు బోర్డ్ కే పరిమితం అయ్యాయి. పెద్దాపుర్ లో నీ క్రీడా ప్రాంగణంలో దాతల సహకారంతో చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం తో అవి నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాంగణంలో పిచ్చి మొక్కలు మొలిచి అస్తవ్యస్తంగా మారింది. ప్రాంగణంలో క్రీడా కోర్టులు ఏర్పాటు చేయక పోవడం తో పాటు క్రీడలు ఆడేవారు లేకపోవడంతో పలు గ్రామాల్లో పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని క్రీడా ప్రాంగణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే క్రీడా సామగ్రిని సరఫరా చేయడంతో పాటు ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.