06-12-2024 01:27:40 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఆయిల్ పామ్ సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది నుంచి గెలలకు ధరలు ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో ఈ పంటను సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
ధర పెరుగుదల, వ్యవసాయ శాఖ రాయితీలు అందిస్తుండటంతో ఆయిల్‌పామ్‌ను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. గత ఏడాదిలో టన్ను గెలల ధర రూ.13 వేలు ఉండగా, ఈ సంవత్సరం నవంబర్ మొదటి వారంలో రూ. 19,144కు పెరిగింది. డిసెంబర్‌లో మూడు రోజుల క్రితం రూ. 20,413లకు చేరుకుంది.
మార్చి వరకు రూ. 22వేలు దాటే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెలల ధర పెరుగుదల కోసం ముడి పామాయిల్‌పై ఎఫెక్టివ్ డ్యూటీని 27.5 శాతానికి పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.30లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు అవుతోంది. ప్రతి ఏటా ప్రభుత్వం లక్ష ఎకరాలో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశగా ముందుకు వెళుతోంది.
గత ఏడాది 59,281 ఎకరాల్లో కొత్తగా పంట సాగు చేశారు. ఇప్పటివరకు 25,420 ఎకరాల్లో కొత్తగా సాగు చేశారు. రాష్ట్రంలో అయిల్ ఫెడ్‌తో పాటు 14 కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా కంపెనీలు నర్సరీలు ఏర్పాటుచేసి రైతులకు మొక్కలు అందిస్తున్నాయి. ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం 10వేల ఎకరాల్లో పంట సాగు ఉండాలి.
36 నెలల తరువాత దిగుబడి..
ఆయిల్‌పామ్ సాగు చేస్తే 32 సంవత్సరాల పాటు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఎకరానికి సగటున 10నుంచి 12 టన్నుల వరకు సుమారు రూ.2.50 లక్షల విలువైన పంట దిగుబడి వస్తుంది. ఎరువులు, కూలీ ఖర్చులు ఎకరానికి రూ. 50 వేలు పోగా రైతులకు రూ. 2లక్షల వరకు వస్తుంది. ఆయిల్ పామ్‌కు క్రిమికీటకాలు, పురుగుల వంటి బాధలేదు.
ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఈ పంటకు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. పశువులు ఈ గెలల జోలికి వెళ్లవు. నీటి వనరులు తక్కువగా ఉన్నా డ్రిప్ సాయంతో సాగు చేయవచ్చు. అదేవిధంగా ఈపంట మధ్యలో అంతర పంటలు కూడా సాగు చేసుకొని ఆదాయం పొందవచ్చు. ప్రభుత్వం పంట ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో కంపెనీలు ఏర్పాట్లు చేస్తుంది.
అక్కడికి పంటను తీసుకొస్తే తూకం వేసి గెలలను తీసుకుంటారు. నాలుగు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. అదేవిధంగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపుతారు.
ఎకరానికి రూ.52 వేల వరకు సబ్సిడీ..
ఎకరం భూమిలో 60 మొక్కలు నాటే అవకాశం ఉంది. ఒక మొక్క ఖరీదు రూ.250 ఉండగా, ప్రభుత్వం రైతులకు రూ.20లకే సరఫరా చేస్తూ రూ.230లను రాయితీగా ఇస్తుంది. పంట సాగు చేసిన నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది నిర్వహణకు ఎకరానికి రూ.4,200 చొప్పున రూ.16,800 ఇస్తారు. మొత్తం నాలుగేండ్లలో ప్రభుత్వం నుంచి రూ.52 వేల వరకు రాయితీ లభిస్తుంది.
రైతులు ముందుకు రావాలి
ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్రంలో రైతులు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కోరుతు న్నారు. ప్రభుత్వం అన్నదాతలకు ఆదా యం వచ్చే పంటను ప్రొత్సహించి, పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం, సూర్యాపేట, నారాయణపేట, వనపర్తి, మెదక్, రంగారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో సాగు అవుతుంది. మిగతా జిల్లాలో ఆశించిన దానికంటే తక్కువగా ఉంద ని, అక్కడ కూడా రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.