calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నచ్చినవారికి ఒక రూల్.. నచ్చకపోతే మరో రూల్

26-11-2025 12:00:00 AM

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వనపర్తి డీఎస్‌ఓ

బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, నవంబర్ 25 (విజయక్రాంతి) : జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారి ఆగడాలు శృతిమించుతున్నాయని బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాథ్ పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ రకరకాల కారణాలతో డిఎస్‌ఓపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

జిల్లాలోని అనేకమంది అవినీతి అధికారులపై బీసీ పొలిటికల్ జెఎసి ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకున్న కలెక్టర్ డీఎస్‌ఓపై మాత్రం ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి సంబంధించి గతంలో కూడా అనేక నిజాలు వెలుగు చూశాయని, ధాన్యం అట్టడుగులో ఉండడం, బకాయిలు అధికంగా ఉండడం వంటి కారణాలతో సివిల్ సప్లయ్ శాఖ జిల్లాలో పూర్తిగా బ్రస్టుపట్టే పరిస్థితి నెలకొందన్నారు.

2022-23 రబీకి సంబంధించి రూ.436 కోట్ల విలువగల యాక్షన్ ప్యాడి జిల్లాలో ఉందని, అనేకమంది డిడిలు కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేబినెట్ సబ్ కమిటీ ధర నిర్ణయించకపోవడంతో డీడీలు కట్టడం లేదన్నారు. అధికారుల ఉద్దేశం రికవరీ చేయడమా? లేక రికవరీ చేయకుండా అక్రమ కేసులు పెట్టడమా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రూ.436 కోట్లు బకాయి ఉన్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదో డిఎస్‌ఓ సమాధానం చెప్పాలన్నారు.

నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న కలెక్టర్ తక్షణమే డీఎస్‌ఓ అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, లేదంటే డిఎస్‌ఓ అవినీతి మరకలు కలెక్టరుకు కూడా అంటుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్, శ్రీరంగాపూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, నాయకులు అస్కని రమేష్, చెలిమిల్ల రామన్ గౌడ్, రమేష్, బీచుపల్లి, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.