calender_icon.png 5 August, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

04-08-2025 10:27:56 PM

భూ భారతి అర్జీలను  వేగవంతంగా పరిష్కరించాలి..

తెలుగు, ఇంగ్లీష్ బాషలపై పట్టు సాధించాలి..

జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్..

పెన్ పహాడ్: విద్యార్థి దశ నుంచి తమ ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) విద్యార్థులకు సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ ఎస్, కస్తూర్బగాంధీ బాలికల విద్యాలయం, అలాగే తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన పదవ తరగతి తెలుగు మీడియం విద్యార్థులకి జరుగుతున్న బయో సైన్స్ సబ్జెక్ట్ క్లాస్ ని విద్యార్థులతో కలిసి విన్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం పదవ తరగతిలో జరుగుతున్న ఇంగ్లిష్ సబ్జెక్టుపై విద్యార్థులని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ పరీక్షల కోసమే కాకుండా భవిష్యత్ లో ఏమి కావాలి అనే దూరదృష్టితో చదవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని తెలిపారు.

తదుపరి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తూ విద్యార్థులు ఎలా చదువు తున్నారు? చదువులో వెనకబడిన విద్యార్థులపై ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు? న్యూ మెథడాలజీ ని విద్యార్థులకి ఎలా భోదిస్తూన్నారని అడిగి తెలుసుకున్నారు.తెలుగు, ఇంగ్లీష్ బాషలపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కేజీబీవీ వంటగదిలోని కూరగాయలు, ఆయిల్, పప్పు పరిశీలించారు. తాజా కూరగాయలతో పాటు నాణ్యమైన సరుకులను మాత్రమే వంటకి ఉపయోగించాలని తెలిపారు.

తదుపరి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి అర్జీల పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అధికారుల బృందాలు గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి లో పరిశీలించి భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్బంగా తహసీల్దార్ భూ భారతి రెవిన్యూ సదస్సుల ద్వారా 2953 అర్జీ లు వచ్చాయని 925  అర్జీ లకి నోటీసులు జారీ చేయటం జరిగిందని,10 అర్జీలను పరిష్కరించటం జరిగిందని మిగిలినవి వివిధ దశలలో పురోగతి లో ఉన్నాయని కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాలు నాయక్, ఎం ఈ ఓ నకిరేకంటి రవి, ఆర్ఐ రంజిత్ రెడ్డి, కే జి బి వి ఎస్ ఒ ఆసియా జబీన్,  ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.