12-09-2025 01:05:27 AM
ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సరిపడా ప్రభుత్వ స్థలం
మండల ప్రజలకు మరింత సౌకర్యవంతం
ఇక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేయాలనేది మెజారిటీ ప్రజల మనోగతం
నాగారం, సెప్టెంబర్ 11: ప్రజలకు మరింతగా సుస్థిరమైన సేవలను అందించే లక్ష్యంగా గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా నాగారం మండలం కూడా 2016 సంవత్సరంలో విజయదశమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది.
అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొత్త భవనాలు లేకుండానే తాత్కాలికంగా గ్రామాల్లో ఉన్న అద్దె భవనాల్లోనే ప్రభుత్వ సామాగ్రిని తరలించి పాలన చేయడం జరిగింది. మండలం ఏర్పడి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న కొత్త భవనాలు ఏర్పాటు చేయకపోవడంతో నాగారం మండల ప్రజలు మరియు వారికి సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పక్కా భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు :
మండల కార్యాలయాలకు పక్కా భవనాలు లేక అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ అధికారులు పడుతున్న ఇబ్బందులను స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు గ్రహించి సీఎం దృష్టికి తీసుకెళ్లాడంతో వారు ఈ ఏడాది జూలై 14న తిరుమలగిరిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ ల నిర్మాణాలకు రూ.11.25 కోట్లు కేటాయించడంతో ఇక్కడి మండల ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా జరిగి కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇంకా స్థల పరిశీలన కూడా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అందరికీ అనువైన స్థలం :
పక్కాభవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు అయినప్పటికీ స్థల పరిశీలన లో అధికారులు తర్జన బర్జనలు పడుతున్నారు. అయితే ఒకప్పటి నాగారం గ్రామం నుంచి ప్రస్తుతం విడిపోయి సూర్యాపేట - జనగామ రహదారి ఆనుకొని ఉన్న నాగారం బంగ్లా అతిథి గృహం శిధిలావస్థకు చేరుకుని ఉంది. దీనికి సంబంధించి దాదాపు రెండున్నర ఎకరాలు ఖాళీ స్థలం ఉంది.
ఈ ప్రదేశంలో గతంలో మండలం చుట్టూ గల గ్రామాల ప్రజలతోపాటు తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి మండలాలకు సంబంధించిన ప్రజలు ఈ రహదారి బంగ్లా ఆతిథ్య గృహంలో విశ్రాంతి తీసుకోవడంతో పాటు దీనికి ఎదురుగానే సిండికేట్ బ్యాంకు, అంగడి, తపాలా, బిఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్చేంజి మొదలైన వాటి కార్యకలాపాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేవారు. మండల ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే నిర్మిస్తే మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనే రహదారి బంగ్లా స్థలాన్ని పరిశీలించిన మంత్రి
సూర్యాపేట - జనగామ రహదారి వెంట ఉన్న రహదారి బంగ్లా ఆతిథ్య గృహాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రహదారి గుండా వెళుతూ శిథిలావస్థలో ఉన్న రహదారి బంగ్లాను పరిశీలించారు. బంగ్లాకు పూర్వ వైభవం తీసుకరావడంతో పాటు ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సహకరిస్తానన్నారు.
రహదారి బంగ్లా లోనే నిర్మాణాలు చేపట్టాలి
కొత్త ప్రభుత్వ కార్యాలయాలను నాగారం రహదారి బంగ్లాలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తగినంత స్థలం ఉన్నది. మరియు రోడ్డు వెంట ఉండడంతో అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు గారు చొరవ తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలను నాగారం రహదారి బంగ్లాలో ఏర్పాటు చెయ్యాలి.
_ గుంటకండ్ల ముకుంద రెడ్డి, నాగారం బంగ్లా.
అదనపు భారం తప్పుతుంది
మాది స్వగ్రామం పేరబోయిన గూడెం మా ఊరు నుంచి నాగారం బంగ్లా ఎక్స్ రోడ్ వరకు రాను పోను 80 రూపాయల దాకా ఆటో చార్జీలు చెల్లిస్తున్నాము. మరియు నాగారం ఎక్స్ రోడ్ నుంచి నాగారం ఊళ్లో ఉన్న ఎంపీడీవో, పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లాలి అంటే మరో అదనంగా 40 రూపాయలు ఆటో కిరాయిలు చెల్లించవలసి వస్తుంది. దీంతో మాకు చార్జీలు అదనపు భారం అవుతున్నాయి. కావున ప్రభుత్వ కార్యాలయాలను రహదారి బంగ్లా లోనే నిర్మించాలి. అప్పుడే అదనపు భారం తప్పుతుంది.
_ పేరబోయిన బిక్షం, పేరబోయినగూడెం గ్రామస్తుడు.