18-11-2025 04:27:19 PM
హన్మకొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారమే 50 శాతం పరిమితితో గ్రామపంచాయతీ ఎన్నికలకి వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం వలన బీసీలకు అన్యాయం జరుగుతుందని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కాళోజి విగ్రహం వద్ద నిరసన తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శేషు మాట్లాడుతూ 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వటం అంటే బీసీలను మరొకసారి మోసం చేయటమే అనే అభిప్రాయపడ్డారు.
బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎదునూరి రాజమౌళి మాట్లాడుతూ చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు జనాభా దామాషా ప్రకారంగా బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. బీసీ జాక్ జిల్లా కన్వీనర్ ధారబోయిన సతీష్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు రిజర్వేషన్లను 23 శాతానికే పరిమితం చేయటం వలన బీసీలు 2428 గ్రామపంచాయతీలను కోల్పోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలలో బీసీలకు పార్టీపరంగా 50 శాతం రిజర్వేషన్లు హామీ ఇస్తే అధికార కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఇస్తామని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బీసీ నాయకురాలు పద్మజా దేవి మాట్లాడుతూ రిజర్వేషన్ల పట్ల బీఆర్ఎస్ కూడా తన వైఖరి వెల్లడి చేయాలని డిమాండ్ చేసినారు.ఈ నిరసన కార్యక్రమంలో బీసీ నాయకులు చిన్నాల యశ్వంత్ యాదవ్, కెడల ప్రసాద్, కృష్ణ కుమార్, సుధాకర్ ముదిరాజ్, గుండు రాజు, తిరుపతి, సనత్, రాజు యాదవ్, ఆకుల విజయ, శివ, హైమావతి, రాము, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.