18-11-2025 05:14:15 PM
ట్రైనీ ఆర్‌డీ ఓ రవితేజ
నషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా విద్యార్థులకు అవగాహన
చివ్వెంల (విజయక్రాంతి): దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించాలాని ట్రైనీ ఆర్‌డీ ఓ రవితేజ పిలుపునిచ్చారు. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన, నషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు కళా రాణీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌డీ ఓ రవితేజ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే శారీరక–మానసిక సమస్యలను విద్యార్థులకు వివరించారు. దేశ అభివృద్ధి విద్యార్థుల చేతుల్లోనే ఉన్నందున, వారు మత్తు పదార్థాలకు ధీమాగా ‘నో’ చెప్పాలని సూచించారు.
అదేవిధంగా అక్రమ రవాణా, డ్రగ్స్ విక్రయం వంటి కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. “విద్యార్థులు స్వయంగా మత్తుపదార్థాలకు దూరంగా ఉండటమే కాదు, వాటి ప్రమాదాలను గ్రామాలలో, సమాజంలో ప్రజలకు తెలియజేస్తూ ఆరోగ్య భారత్ నిర్మాణానికి తోడ్పడాలి” అని రవితేజ సూచించారు. ఈ సందర్భంగా ఆర్‌డీ ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, వంటశాల శుభ్రత, పరిశుభ్రమైన నీటి లభ్యత గురించి వివరాలు తెలుసుకుని, అందించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంఈఓ కళారాణి,డాక్టర్ భవాని, డిప్యూటీ తహసీల్దార్ జ్యోతిర్మయి, ఆర్‌ఐ శ్రీనివాస్, శ్రావణి, కార్యదర్శి విక్రమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.