calender_icon.png 6 August, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీఎంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి

06-08-2025 12:00:30 AM

అదనపు పాలనాధికారికి  జేఏసీ వినతి

కాగజ్ నగర్,(విజయక్రాంతి): జిల్లాలోని సిర్పూర్ కాగితం మిల్లు(ఎస్పిఎం) ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తూ స్థానిక నిరుద్యోగ యువతను విస్మరిస్తున్నట్లు జిల్లా నిరుద్యోగ జేఏసీ   ప్రతినిధులు ఆరోపించారు. మంగళవారం జిల్లా అదనపు పాలనాధికారి దీపక్ తివారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పి. రమేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాల ప్రకారం  80 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ యాజమాన్యం తుంగలో తొక్కిందన్నారు. పలుమార్లు జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యాజమాన్యానికి వినతి పత్రాలను సమర్పించినప్పటికీ స్పందన కరువైందన్నారు.

యాజమాన్యం స్పందించకుంటే జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  ప్రభుత్వం ముడి సరుకు, పన్నులు, విద్యుత్ పై కోట్ల రూపాయలు రాయితీ కల్పించడం వల్లే 2018 ఆగస్టు 2న మిల్లు పునరుద్ధరణ జరిగిందన్నారు.  ప్రస్తుతం మిల్లులో స్థానికేతరులకు ఎక్కువ వేతనాలు, స్థానిక ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు.   దాదాపు 150 మంది స్థానిక నిరుద్యోగ యువకులు యాజమాన్యానికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన కరువైందన్నారు.