21-05-2025 10:03:11 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): విత్తనాల డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని, జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాలు, ఎరువుల విక్రయ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తన చట్టాలు నిబంధనలపై విత్తన వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వచ్చే వానాకాలం సాగులో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉండే విధంగా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
నకిలీ విత్తనాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని, నకిలీ విత్తనాల విక్రయాలు ఆమోదయోగ్యం కాదని, ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాలని, నకిలీ విత్తన విక్రయాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన దుష్టాంతాలను ఇక ముందు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, టెక్నికల్ ఏవో విజ్ఞాన్, డీఎస్పీ తిరుపతిరావు, హర్టికల్చర్ అధికారి మరియన్న, డిసిఓ వెంకటేశ్వర్లు మార్క్ఫెడ్ డిఎం శ్యామ్ ఏడిఏలు విజయచంద్ర, శ్రీనివాస్ రావు, మండల వ్యవసాయ అధికారులు, విత్తన వ్యాపారులు పాల్గొన్నారు.