21-05-2025 09:57:00 PM
మీడియా ముందు బాధితుల మొర..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కర్జీ ఇసుక రీచ్ లో ఏడేళ్లుగా సాండ్ రీచ్ అసిస్టెంట్ లు గా పనిచేస్తున్న తమను అకారణంగా విధుల నుంచి తొలగించారని బాధితులు గొర్లపల్లి అశోక్, గణపతి అంజన్నలు తెలిపారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు విలేకరులకు తమ గోడును వెళ్ళబుచ్చుకొన్నారు. ఏడేళ్లుగా ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా పనిచేస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయం తీసుకువస్తున్నామని వారు తెలిపారు.
నెన్నెల మండలానికి చెందిన నాయకుడు హరీష్ గౌడ్, కన్నెపల్లి మండలానికి చెందిన నర్సింగరావులు జిల్లా కలెక్టర్, మైనింగ్ ఏడీ లకు చెప్పి రాజకీయ వత్తిడి తెచ్చి తమను అకారణంగా విధుల నుంచి తొలగించి తమను తమ కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. గోడు చెప్పుకుందామని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తే పీఏలు తమను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలువ నీయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ మైనింగ్ ఏడీలు వెంటనే స్పందించి తమను విధుల్లోకి తీసుకోనేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ఆదుకోవాలని వారు వేడుకున్నారు.