calender_icon.png 9 September, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో విచ్చలవిడిగా ఓపెన్ బార్లు!

09-09-2025 12:00:00 AM

  1. బెల్ట్ షాపులకు మద్యం డోర్ డెలివరీ
  2. బెల్ట్ షాపుల్లోనే డిమాండ్ బ్రాండ్ సరుకు
  3. అధిక ధరలకు విక్రయాలు 
  4. మద్యం ప్రియుల జేబుకు చిల్లు
  5. నామ్కే వాస్తేగా బ్రాండీ షాపులు

మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): అక్రమ మద్యం వ్యాపారం మహ బూబాబాద్ జిల్లాలో మూడు సీసాలు, ఆరు పెగ్గుల మాదిరిగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆవాస ప్రాంతంలో కనీసం రెండుకు తగ్గకుండా ఓపెన్ బార్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఐతే ఒక్కోచోట నాలుగు తగ్గకుండా బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. బాహాటంగా, నిర్భయంగా బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన మద్యం షాపు పక్కనే సిట్టింగ్ రూమ్ కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖకు రుసుము చెల్లించి మద్యం తాగిందుకు అనుమతి ఇస్తారు. జిల్లాలో అలా కాకుండా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ, బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు  నిర్వహిస్తున్నారు. ఓపెన్ బార్లు, బెల్ట్ షాపుల్లో మద్యం ప్రియులు అడిగిన బ్రాండ్ బీర్లు, మద్యం లభించడం విశేషం.

లైసెన్స్ పొందిన మద్యం షాపుల్లో మద్యం ప్రియుల డిమాం డు బ్రాండ్లకు చెందిన బీర్లు, మద్యం ‘నో స్టాక్’ అని సమాధానం చెబుతుండగా, తాము కోరిన బ్రాండ్ మద్యం, బీర్లు బెల్ట్ షాపుల్లో, ఓపెన్ బార్ల వద్ద లభిస్తున్నాయని, కాకపోతే లైసెన్స్ పొందిన మద్యం షాపు లో ఎమ్మార్పీ ధరకు ఇవ్వకుండా అదనంగా సీసాకు 40 నుంచి 50 రూపాయలు తీసుకుం టున్నట్లు మద్యం ప్రియులు పేర్కొంటున్నారు. తమకు ఇష్టమైన బ్రాండ్ బీర్లు, బ్రాండీ తాగడానికి బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లకు వెళ్లి ఎక్కువ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, జేబులకు చిల్లులు పెడుతున్నారని వాపోతున్నారు. 

సిండికేట్ గా మద్యం వ్యాపారులు

ప్రత్యేక ‘స్టిక్కర్ల’ ద్వారా అధిక ధరలకు విక్రయం

అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించడానికి మండలాల వారీగా లైసెన్స్ మద్యం షాపుల యజమానులు ‘సిండికేట్’ గా ఏర్పడి ప్రత్యేకంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లకు మద్యం సరఫరా చేయడానికి  పలు మండలాల్లో ప్రత్యేకంగా ఒక షాపు ఏర్పాటు  చేసుకున్నారు. అక్కడి నుంచే ప్రత్యేకంగా రూపొందించిన సిండికేట్ ‘స్టిక్కర్’ లేదంటే ‘స్టాంప్’  సీసాలపై వేసి బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లకు క్వార్టర్ కు 10, ఆఫ్ కు 20, ఫుల్లుకు 40, బీరుకు 20 చొప్పున అదనంగా ధర తీసుకుంటూ నేరుగా ప్రత్యేక వాహనం ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు.

దీనితో ఓపెన్ బార్లు, బెల్ట్ షాపులు నిర్వహించేవారు మరో 20 రూపాయలు సీసాకు అదనంగా తీసుకుని మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. ఏ మండలానికి ఆ మండ లం మద్యం షాపుల వారు ఇలా ప్రత్యేక సిండికేట్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా వేసిన స్టిక్కర్ మద్యం అమ్మకాలే జరు గుతున్నాయా లేదా అంటూ మధ్య మధ్య లో తనిఖీలు కూడా నిర్వహించడం మరో విశేషం. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చి విక్రయించే వారిని గుర్తించి అధికారుల చేత వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారు.

ప్రత్యేకంగా కుకింగ్ మాస్టర్లు

జిల్లావ్యాప్తంగా అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులు, ఓపెన్ బార్ల వద్ద మద్యం ప్రియులకు మద్యం తాగుతూ మధ్యలో నంజుకోవడానికి రుచిగా ఉండే విధంగా నాన్ వెజ్, ఇతర తినుబండారాలు, ఫాస్ట్ ఫుడ్ వండి పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా కుకింగ్ మాస్టర్లను నియమించుకున్నారు. పెద్ద పెద్ద బార్లలో లభించే తరహాలో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓపెన్ బార్లలో తినుబండారాలు లభిస్తున్నాయి.

అటు అనుకూలమైన బ్రాండ్ మద్యం, బీర్లు లభిస్తుందడం, ఇటు రుచికరమైన తినుబండారాలు లభిస్తుందడంతో మద్యం ప్రియు లు ఓపెన్ బార్లలో మజా చేస్తున్నారు. దీని తో ఓపెన్ బార్ల జోరు ఇటీవల జిల్లా వ్యాప్తంగా మరింత జోరందుకుంది. అయితే ఓపెన్ బార్లు, బెల్ట్ షాపుల్లో వంటల్లో కల్తీ నూనె, ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

కల్తీకారం, పసుపు, మసాలాలు, పాడైపోయిన చికెన్, మటన్, చేపలు వండుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కల్తీ ఆహార పదార్థాలతో తయారు చేసి ‘రోస్ట్ ’ గా పెడుతుండడంతో లొట్టలేసుకుంటూ తింటూ అనారోగ్యం పాలై ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 

తనిఖీ అధికారులకు మామూళ్ల మత్తు?

విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ బాహాటంగా సిట్టింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఓపెన్ బార్లు, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ  కట్టడి కోసం తనిఖీ చేయాల్సిన అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు ఏదో ఒక పని చేసుకుని జీవిస్తున్నారు అంటూ.. వదిలేయాల్సి వస్తుందని చెబుతుండగా, మరికొందరు ప్రభుత్వమే మద్యం విక్రయాల కోసం మద్యం షాపుల యజమానులకు టార్గెట్లు విధించడం వల్ల ఇలాంటి పరిస్థితికి చేయూతనిస్తున్నారని పేర్కొనడం గమనార్హం.

ప్రతినెల ఏ మండలానికి ఆ మండలంలో ఏర్పడ్డ ‘సిండికేట్’ షాపు నుండి సీసాకు అదనంగా వసూలు చేసిన సొమ్ములో కొంత సంబంధిత శాఖల అధికారులకు నెల నెల మామూళ్లు అందుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీనితో సంబంధిత శాఖల అధికారులు ఆ వైపు ‘కన్నెత్తి’ చూడకుండా ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

అటు అధికారుల ప్రోత్సాహం, ఇటు మద్యం షాపుల టార్గెట్ పూర్తి కోసం అడ్డదారుల్లో మద్యం విక్రయాలకు అండగా ఉండడం వెరసి మహబూబాబాద్ జిల్లాలో అక్రమ మద్యం విక్రయ దందా యదేచ్చగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం

ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు మద్యం అమ్మకాలు సాగించాలి. అనుమతి లేకుండా సిట్టింగ్, ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మకాలు నిర్వహించకూడదు. బెల్ట్ షాపు ల నిర్వహణపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నాం. కేసులు కూడా నమోదు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బార్లు నిర్వహించినట్లు ఫిర్యాదు చేస్తే తప్ప కుండా చర్యలు తీసుకుంటాం. 

- పి.కిరణ్, ఎక్సైజ్ సూపరిండెంట్, 

మహబూబాబాద్ జిల్లా