calender_icon.png 26 May, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్

08-05-2025 12:00:00 AM

బుధవారం ఉదయం.. ప్రాతఃకాలంలో భారతావనిని ప్రతీకారం తీర్చుకున్నామన్న గర్వం నిలువెల్లా పులకింపజేసింది. మే 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మందిని కిరాతకంగా హత్య చేసిన ఉగ్రవాదుల చర్యకు రెండు వారాల్లో భారత్ ప్రతీకారం తీర్చుకొంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట.. పహల్గాంలో హిందూ మహిళల నుదిట కుంకుమను చెరిపేసే తీరున ఉగ్రవాదుల ఉన్మాదానికి భారత్ సైన్యం బదులిచ్చింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో, పాకిస్థాన్ భూభాగంలో 9 ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా, 25 నిమిషాల్లో భారత సైన్యం పని ముగించింది. దాదాపు 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించినట్లు వార్తలు వెలువడుతుండగా, ‘కాదు మావైపు మరణించింది 26 మందేనని’ పాకిస్థాన్ ప్రకటించుకొంది. జైషె మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందిన స్థావరాలు తొమ్మిది చోట్లా ధ్వంసమయ్యాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎంపిక చేసుకున్న లక్ష్యాలపైనే భారతసైన్యం దాడి జరిపింది. శిబిరాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగాయి.

అయినా భారత్ ఈ దాడులతో చేసింది యుద్ధమేనని, తగిన విధంగా జవాబు చెబుతామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రంకెలు వేశారు. భారత్‌లో జైహింద్ అంటూ సైన్యానికి సెల్యూట్ చేస్తున్న పౌర సమాజం సంబరాల ముందు పాక్ దీనాలాపనాలు ఎవరికీ వినిపించడం లేదు. జైషె మహమ్మద్‌కు ప్రధాన స్థావరంగా వున్న బహవల్‌పూర్, లష్కరే తోయిబాకు స్థావరమైన మురిద్కేపై ఈ దాడుల్లో భారత్ సైన్యం ఎక్కువగా దృష్టి పెట్టింది. భారత వైమానిక, నౌకాదళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రఫేల్ యుద్ధ విమానాలను, స్కాల్ఫ్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను ఉపయోగించింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆగ్రహంతో రగిలిపోయింది. పాకిస్థాన్ ఉగ్రచర్యలకు ఊతం ఇచ్చే పని ఇక ఎప్పటికి ఆపదా అనే ప్రశ్న ప్రతి పౌరుడినీ కలచివేసింది. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కట్టడి చేసేలా సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం మొదలు వాణిజ్య, విమానయానం అంశాల వరకు తెగతెంపులకు పోయింది. అదే సమయంలో త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది.

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నిచ్చింది. చర్య, ప్రతిచర్యలను ఊహించుకుంటూ, 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరపాలని నిర్ణయించింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి రెండు రాత్రులు వైమానిక దళ విన్యాసాలు పెద్ద ఎత్తున జరిపేందుకు సన్నద్ధమైంది. భారత్‌లో తీసుకుంటున్న చర్యలు పాకిస్థాన్‌ను గందరగోళ పరిచాయి. అసహనంతో పాకిస్థాన్ నాయకత్వం, అణ్వస్త్ర ప్రయోగం నుంచి మిస్సైల్ దాడులకూ వెనుకాడమంటూ ప్రకటనలిస్తూ కాలం గడిపాయి.

చివరికి భద్రతామండలిలోనూ పాకిస్థాన్‌కు అక్షింతలే పడ్డాయి. భారత్ ప్రతీకారంగా తీసుకునే చర్యలు ఆర్థికంగా, మిలటరీ పరంగా తమ నడ్డి విరుస్తాయని పాక్ నాయకత్వం ఆందోళన. ఇలాంటి సందర్భంలోనే భారత్, పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేలా, అనూహ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా ముగించింది. మరోవైపు, పహల్గాం దాడి మరుసటి రోజునుంచి ఎల్‌ఓసీవద్ద ప్రతిరాత్రి పాక్ సైనికులు జరుపుతున్న కాల్పులు వారి అభద్రతను చెప్పకనే చెబుతున్నాయి.