08-05-2025 12:00:00 AM
శాస్త్రీయ పురోగతికి పునాది వేసే ప్రయోగశాలల్లో, వెలుగుల నుంచి దూరంగా, మౌనంగా విలవిల్లాడే లక్షలాది జీవులు మన మానవతా విలువలపై ప్రశ్నలు వేస్తున్నాయి. ఎలుకలు, కుందేళ్లు, కుక్కలు, కోతులు వంటి వివిధ జాతుల జీవులు, మానవ అవసరాల పేరిట చిన్న గదుల్లో బందీలవుతూ, విచారకరమైన ప్రయోగాలకు గురవుతూ దుఃఖ జీవితాన్ని అనుభవిస్తున్నాయి.
ఇవి భావోద్వేగాలు కలిగిన జీవులు కావడం గమనించాల్సిన విషయం. ప్రతి సంవత్సరం అమెరికాలోనే దాదాపు 11 కోట్లకు పైగా జంతువులు ప్రయోగాల కోసం బలవు తుంటాయి. ఔషధాలు, రసాయనాలు, సౌందర్య సాధనాలు, ఆహార ఉత్పత్తులపై పరీక్షల పేరుతో ఈ జంతువులు విషపదార్థాల శ్వాస, శస్త్రచికిత్సలు, దీర్ఘకాల నిర్బంధం, సామాజిక పరిమితులు వంటి ఎన్నో మానసిక, శారీరక బాధలు భరిస్తుండటం దయనీయం.
అందుబాటులో ఆధునిక, సురక్షిత పద్ధతులు ఉన్నప్పటికీ, పాత చట్టాలు ఇంకా జంతు ప్రయోగాలనూ తప్పనిసరి చేస్తున్నాయి. వైద్య శిక్షణ, వ్యాధుల పరిశోధన, ఔషధ పరీక్షల కోసం ఇప్పటికీ అనేక ప్రయోగాలు మూగజీవులపై కొనసాగుతుండటం విచారకరం. ఇది శాస్త్రీయ అవసరాలకన్నా ఎక్కువగా చట్టాలు, అలవాట్ల ప్రభావమే. ఈ నేపథ్యంలో పునరాలోచన అవసరం.
ఇన్‌విట్రో పరీక్షలు, మానవ కణ సంస్కరణలు, కంప్యూటర్ నమూనాలు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ‘నేషనల్ యాంటీ వివిసెక్షన్ సొసైటీ’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 10 కోట్ల జంతువులు ప్రయోగ శాలల్లో బలవుతుంటా యి. కొన్ని రకాల ప్రత్యామ్నాయ పద్ధతులు, ఖచ్చితత్వం, ఖర్చు తక్కువ వంటి చర్యలతో జంతుహింసకు ముగింపు పలకవలసి ఉంది.
వీటి రక్షణ కోసం 1979లోనే అంతర్జాతీయ స్థాయిలో చర్యలు ప్రారంభమైనాయి. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ (24)లో జంతువుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రకంగా ఆయా ప్రయోగశాలలలో మృత్యువు బారిన పడుతున్న జంతువుల నిశ్శబ్ద వ్యధను ప్రపంచానికి గుర్తు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే జంతు హక్కుల పట్ల చైతన్యం కలిగించడానికి అందరూ కృషి చేయవలసి ఉంది. శాస్త్రజ్ఞానం కోసం జంతువులే త్యాగమవ్వాల్సిన అవసరం లేదని, అనుభూతులున్న జీవులను కాపాడే మార్గాలూ మనకు అందుబాటులో ఉంటాయని శాస్త్రవేత్తలు గ్రహింపుకు రావాలి.
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో వెలువడిన ఓ విశ్లేషణాత్మక అధ్యయనం ప్రకారం, జంతువులపై నిర్వహించే ప్రయోగాలు మనుషులపై ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయని తేలింది. దీనర్థం జీవులను బాధ పెడుతూ జరిపే ప్రయోగాలకన్నా, మానవ అనుమతితో, సాంకేతికంగా ఆధునికమైన మార్గాలు చాలా మెరుగ్గా పని చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు ప్రజలలో అవగాహన వేగంగా పెరగాలి.
డా. వేపకొమ్మ కృష్ణకుమార్