19-08-2025 01:38:52 AM
ఇంజినీరింగ్ కొత్త బ్యాచ్‌కు ఘన స్వాగతం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం గురునానక్ విశ్వవిద్యాలయంలో సోమవారం రెండవ ఓరియంటేషన్ డేను నిర్వహించింది. ఈ సందర్భంగా 2025 26 విద్యా సంవత్సరానికి చెందిన కొత్త బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఏపి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు గిరీష్ బంట్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల గురించి విద్యార్థులకు వివరించారు. ఎస్‌ఏపి, నోబెల్ క్యూ సంస్థలు ఎస్‌ఏపి ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సును ప్రారంభించడానికి గురునానక్ విశ్వవిద్యాలయంతో ఎంఓయూపై సంతకం చేశాయి. ఇది బెంగళూరులోని ఎస్.ఏ.పి ల్యాబ్‌లతో అనుసంధానించబడి ఎం.ఎన్.సి లలో ప్లేసె మెంట్ పొందడానికి ప్రత్యక్ష మార్గం అని అన్నారు. విశ్వవిద్యాలయ ఛాన్సలర్, గురునానక్ సంస్థల వైస్-చైర్మన్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ ప్రసంగిస్తూ.. దక్షిణ భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఎస్‌ఏపి -ఇంటిగ్రేటెడ్ బిటెక్‌ను ప్రారంభించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం గురునానక్ అని అన్నారు.
విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్, గురునానక్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెఎస్ సైని తన ప్రసంగంలో విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలను పరిశ్రమ ఔచిత్యంపై బలమైన దృష్టితో విద్యా నిపుణులు రూపొందించారని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో డెరెక్టర్-డాక్టర్ సి కలైయరసన్, రిజిస్ట్రార్- డాక్టర్ విశాల్ వాలియా, యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ, యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ కుంద్రా, ప్లానింగ్ అండ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ పి పార్థసారధి పాల్గొన్నారు.