14-05-2025 10:21:54 PM
రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ..
హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఓరుగల్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ(Minister Konda Surekha) అన్నారు. తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణుల బృందం బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ సందర్శించింది. ప్రపంచ సుందరీమణులకు వరంగల్ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది. జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, సిపి సన్ ప్రీత్ సింగ్ ల నేతృత్వంలో హరిత కాకతీయలో వారికి జిల్లాల యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.
వెయ్యి స్తంభాల దేవాలయం సందర్శన అనంతరం సుందరీమణుల బృందం ఖిలా వరంగల్ కు చేరుకొని, కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత కాలంకారి దర్రీస్, జిఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపుల ప్రత్యేకతల గురించి అధికారులు వివరించారు. కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళ నైపుణ్యానికి, నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఖిలా వరంగల్ కోటను కాకతీయులు తమ పరిపాలనలో ఈ కోటను అద్భుత నిర్మాణాలతో తీర్చిదిద్దిన తీరును, కోటలోని మూడు వృత్తాకార పొరలు భారీ రాతి ద్వారాలు (కీర్తి తోరణాలను) పరిశీలించి సుందరీమణులు ఫోటోలు దిగారు.
తదనంతరం కాకతీయులు తమ పరిపాలనలో ఈ కోటలో అద్భుత నిర్మాణాలు, చరిత్ర, స్వయంభూ శివాలయం వంటి కాకతీయుల నిర్మాణాలు, ప్రాముఖ్యత లను సౌండ్ అండ్ లైట్ ద్వారా ప్రదర్శిస్తూ వివరించిన తీరును సుందరీమణులు తిలకించారు. అనంతరం యుద్ధ సమయంలో కాకతీయులు నిర్వహించే కళాకారులు ప్రదర్శించిన పేరిణి శివతాండవం నృత్య రూపకం, రాణి రుద్రమ నృత్య రూపకాలు ప్రపంచ సుందరీమణులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి శ్రీమతి కొండ సురేఖ మాట్లాడుతూ... ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు.. చరిత్రకు నిలువెత్తు నిదర్శనమైన ఓరుగల్లు చారిత్రాత్మక నగరానికి వివిధ దేశాల సుందరిమణులకు స్వాగతం.. సుస్వాగతం అన్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమని. వరంగల్ భవ్య, దివ్య, నవ్య నగరంగా పేరు గాంచిందన్నారు. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, రమణీయ శిల్ప సౌందర్యం అద్భుతమై ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయమని, ఒకటి కాదు రెండూ కాదూ వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరమన్నారు. త్రినగరిలో కొలువైన త్రికూటాలయం వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకమని తెలిపారు. కాకతీయ రాజుల కట్టడాలు నేటికీ ఆనాటి చరిత్రకు నిలువెత్తు నిలబడి ఉన్న సాక్ష్యాలన్నారు. వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం కాకతీయులు అద్భుత నిర్మాణమని అన్నారు.
వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుందని తెలిపారు. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ సంపద, చారిత్రక ప్రదేశాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలో రాష్ట్రంలో వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లు, త్వరలో మామూనూరు ఎయిర్పోర్ట్ రాసున్నదన్నారు. మిస్ వరల్డ్ గ్లోబల్ ఈవెంట్, రాష్ట్ర సాంప్రదాయం పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇది ఒక చక్కటి అవకాశమని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 72వ మిస్‌వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక "మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్" గా నిలిపే అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమం తెలంగాణను ప్రపంచ దృష్టిలో నిలిపి, దాని బ్రాండ్ విలువను, ఆకర్షణను పెంచుతుంది. ఈ అంశాలు హైదరాబాద్‌ను ఒక గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చడంలో మిస్ వరల్డ్ పోటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంతర్జాతీయ గుర్తింపు, చారిత్రక ప్రాముఖ్యత, ప్రత్యేకమైన గ్రామీణ నేపథ్యం కారణంగా తెలంగాణలో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి చేనేత వస్త్రాలని, పోటీ సమయంలో అందరు పోటీదారులు తెలంగాణ చేనేత దుస్తులను ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది, ఇది రాష్ట్ర గొప్ప వస్త్ర సంస్కృతిని సూచిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ రోజు వరంగల్ లో ప్రఖ్యాతిగాంచిన చేనేత కాలంకారి డర్రిస్, జిఐ పొందిన చపాట మిర్చి, పసుపు వంటి స్టాల్స్ ఫ్లియా మార్కెట్ లో ఏర్పాటు చేసి వాటి ప్రాచుర్యం గురించి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు వివరించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ పర్యాటక రంగానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆహారం, ఆతిథ్యం, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, చేనేత వస్త్రాలు, పెట్టుబడులు వంటి ప్రతి రంగంలో తెలంగాణను ముందంజలో ఉంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణతో పాటు వరంగల్ జిల్లాను ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవడం మాకు గర్వంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మిస్ అర్జెంటీనా, మిస్ కెనడా, మిస్ పనామా, యునైటెడ్ స్టేట్స్, పరాగ్వే తదితరులు తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతి అద్భుతమైనదని కొనియాడారు.
ప్రపంచ సుందరీమణుల పోటీల్లో భాగంగా ఓరుగల్లు సందర్శించిన సుందరిమణులకు వరంగల్ కోటలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే. కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, చేతుల మీదుగా వరంగల్ ప్రఖ్యాతిగాంచిన చేనేత కలంకారి డర్టీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్ లో కూడిన బహుమతులను సుందరీమణులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిసిపి అంకిత్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.