03-08-2025 12:00:00 AM
ఈ జీవానికి ప్రాణం శ్వాస.
మన మాటకి మూలం శ్వాస.
జీవాన్ని నడిపేది శ్వాస.
జీవితాన్ని రూపుదిద్దేది మాట. అనంత బ్రహ్మాండ విశ్వంతో అనుసంధానమైనది ఈ అనాది మన శ్వాస.
శ్వాసించడంతో మన జీవితం మొదలవుతుంది.
నిశ్వాసతో జీవితం అంతమవుతుంది.
ఈ నడుమ మన మాటే మన శ్వాస, మన శ్వాసే మన మాట.
మాటకు, పాటకు, శ్వాసకు గర్భంలో ఉన్న తల్లీ,బిడ్డలకున్న సంబంధం లాంటిది. ఒకటి లేక ఇంకోటి మనజాలదు. తల్లి ఆరోగ్యాన్ని బట్టే బిడ్డ ఆరోగ్యం ఎలాగో మొత్తం శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బట్టే మన మాట, పాట, ఊపిరి ఆధారపడి ఉంటాయి.తల్లి బలంగా ఉంటే బిడ్డ బలంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థ బలంగా ఉంటే మన మాట గంభీరంగా, శ్రావ్యంగా ఉంటుంది.తల్లి శ్వాస అగితే బిడ్డ శ్వాస ఆగిపోతుంది. గుండె ఆగిపోతే దాని లయ, రక్త ప్రసరణ ఆగిపోతాయి. శ్వాస ఆగితే శ్వాసించడం ఆగిపోతుంది. మాట మాయమైపోతుంది.
శ్వాసకు, మాటకు, మంచికి ఉన్న సంబంధం
నోరు మంచిదయితే వూరు మంచిదవుతుంది అంటారు. మనసు మంచిదయితే మాటకూడా మంచిగానే ఉంటుంది. మనసు వికలమైతే, మనసు మాలిన్యమైతే మాటకూడా మారిపోతుంది. బయట కాలుష్యం ఎక్కువైతే శ్వాస మారిపోతుంది. క్రమంగా అనారోగ్యానికి అది దారితీస్తుంది. శ్వాసలో పలు ఇబ్బందులు మొదలౌతాయి. గాలి స్వచ్ఛంగా ఉంటే శ్వాస స్వేచ్ఛగా ఉంటుంది. గాలి మలినమైతే, శ్వాసమార్గం, శ్వాస అవయవాలు బలహీనపడతాయి. క్రమంగా ఊపితిత్తులు దెబ్బతింటాయి. బలహీనమైన శ్వాస ఉంటే మాటకూడా బలహీనంగానే ఉంటుంది కదా.
అంటే ఊపిరితిత్తుల బలం, ఆరోగ్యం స్వచ్ఛమైన గాలితో, పరిసరాలతో ముడిపడివుంటుంది. అలాగే మాట కూడా.
మంచి ఆలోచనలు మంచిభావాన్ని కలిగిస్తాయి. మంచి భావనలు మంచి పలుకులకు దారితీస్తాయి. మనసు మలినమైన, బలహీన పడినా మాట మలినమౌతుంది, బలహీనపడిపోతుంది. మాటలో అర్థం పరమార్ధం స్వార్థం స్వప్రయోజనం అన్నీ.. పదాల వెనకే దాగివుంటాయి. వీటిని బట్టే మాట, మన ముఖకవళికలు, బాడీ లాంగ్యేజ్ ఆధార పడి ఉంటాయి . అందుకే సత్యానికి , ధర్మానికి -మాట గట్టిగా, స్పష్టంగా ఉంటుంది. అసత్యాలు, అబద్దాలు వట్టి గాలి మాటలుగా మిగిలిపోతాయి. మనిషి విలువను తగ్గిస్తాయి. అందుకే మాటే మంత్రం. మాటే మంచిని పెంచేది, పంచేది, అభివృద్ధికి దారులు పరిచేది. మళ్లీ ఆ మాటే మనసును తుంచేది , విధ్యంసాన్ని సృష్టించేది . వినాశనానికి దారితీసేది.
మాటకు, చేతకూ పొంతన ఉంటే మహా మనిషి అవుతాడు, అలాంటి వారే మహాత్ములు అవుతారు. చరిత్రలో మిగిలిపోతారు. మాటకు, చేతకు పొంతన లేకపొతే విలువని కోల్పోతారు, చరిత్రహీనులౌతారు.
ఆరోగ్యాంగా శ్వాస మార్గం
మనసులోనే మాట రూపుదిద్దుకుంటుంది. అది శబ్దంగా మారడానికి పెదవులు దాటడానికి..ఆలోచన మొదలయ్యే స్థానం నుండి గాలి మార్గం, శ్వాస మార్గం, ముక్కులు, పెదవుల వరకు అన్నీ ఆరోగ్యాంగా ఉండాలి. బలంగా ఉండాలి. ఒకదానికొకటి అనుసంధానంగా (కోఆర్డినేషన్) ఉండాలి. ఇందుకు శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు సహకరించాలి. ఒక్క శ్వాస వ్యవస్థ( రెస్పిరేటరీ సిస్టం) ఆరోగ్యాంగా ఉంటే సరిపోదు. మొత్తం నాడీ వ్యవస్థ ( సెంట్రల్, పెరీఫెరల్ నెర్వస్ సిస్టం), రక్త ప్రసరణ వ్యవస్థ ( కార్డియోవాస్క్యులార్ సిస్టం) హార్మోనల్ సిస్టమ్, మస్కులార్ సిస్టమ్ ఇలా ఒకటేమిటి దేహంలో ఉన్న ప్రతీ కణం ఆరోగ్యాన్ని బట్టే మన మాట, దాని తాలూకా శబ్దం, ఆ లయబద్దం, ఆ శ్రావ్యం, ఆ మృదు మధురం ఆధారపడి ఉంటాయి .
డయాఫ్రమ్
శ్వాస మార్గం, శ్వాస వ్యవస్థలో ప్రధానంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం అతి ముఖ్యమైనది. అలాగే డయాఫ్రమ్. డయాఫ్రమ్ అనేది సిరంజిలో పిస్టన్ లాగే పనిచేస్తుంది. అది సంకోచించినప్పుడు పిస్టన్ క్రిందికి లాగినట్టుగా ఉండి, గాలి వేగంగా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది (500 ఎంఎల్ లేక సీసీ). దీన్ని టైడల్ వాల్యూమ్ అంటారు. గాలిని పూర్తిస్థాయిలో ప్రయత్నపూర్వకంగా బలంగా 6 నుంచి 10 సెకన్ల పాటు పీల్చి అంతే సమయం పాటు వదిలితే దాన్ని మన వైటల్ కెపాసిటీ అంటాం. 5 నుండి 6 లీటర్ల గాలి ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని బట్టి, దేహధారుడ్యాన్ని బట్టి ఉంటుంది.
వైటల్ కెపాసిటీ ఈ వైటల్ కెపాసిటీని బట్టే ఎన్ని మాటలు, ఎన్ని పదాలు పలుకుతాం, దానికి పట్టే సమయం ఆధారపడి ఉంంటాయి.
మనిషి ఒక నిమిషంలో దాదాపుగా 100 నుంచి 130 పదాలు పలుకుతారు. అంటే దాదాపుగా సెకండుకు రెండు మాటలు. ఒక బ్రీత్‌లో, అంటే ఒక శ్వాసలో 10 నుంచి 20 వరకు పదాలు, మాటలు పలుకుతాం. శ్వాస మీద పట్టు ఉంటే, భావోద్యేగాలను నియంత్రించుకుంటూ మాట్లాడితే ఒక శ్వాసలో ఎక్కువ పదాలని మాట్లాడవచ్చు. లేదంటే ఒక శ్వాసలో ఒకటి లేదా రెండు పదాలకే శ్వాస అయిపోతుంది. కోపంతో రేయ్ అన్నా, ఏరా, ఏందీ, ప్పో, పోరా అన్నా చూడండి ఒకటి లేదా రెండే మాటలు వస్తాయి. తరువాత శ్వాస అయిపోతుంది, ఇంకో శ్వాస తీసుకుంటాం.
అలా వేగంగా మాట్లాడితే కొన్ని మాటలకే శ్వాస అయిపోతుంది. ప్రశాంతంగా, ఊపిరి లోనికి పీల్చి మెల్లగా స్పష్టంగా మాట్లాడితే దాని ప్రభావం బలంగా ఉంటుంది. ఇదే శ్వాస మీద నియంత్రణ అంటే. వేగంగా, ఆందోళనగా మాట్లాడితే దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. శ్వాస మీద, భావోద్యేగాలమీద, ఆలోచనల మీద పట్టు ఉన్న వారే మంచి నాయకుడౌతారు, సంభాషణ కర్త అవుతారు. దీన్ని నడకతో పోల్చవచ్చు. మధ్యస్తంగా నడిచినప్పుడు నిముషానికి అటు ఇటుగా 120 అడుగులు వేస్తాం. అంటే సెకండుకు రెండు అడుగులు. అంటే పదాలకు, పాదాలకు సంబంధం ఉందేమో. నువ్వు చెప్పే మాటలకు నువ్వు వాడే పదాలకు పాదాలు కదులుతాయి. ఏ మాటకు, ఏ పాటకు ఏ పాదం ఎటు కదులుతుందో అనే దాన్ని బట్టే మన స్థానం, మన గమ్యం ఆధారపడి ఉంటుంది .
శ్వాసమార్గంలో ఇబ్బందులు
ఊపితిత్తుల్లోకి గాలి లోపలికి, బయటకు గాలిమార్గాల ద్యారా ( బ్రాకియల్) వెళుతుంది. గాలి మార్గాలు కొన్ని కారణాలవల్ల (అలర్జెన్స్, ఇరిటాంట్స్) మూసుకుపోతే, ఆస్తమా, సీవోపీడీ, బ్రాంకైటిస్ లాంటి జబ్బులొస్తాయి . మాటలో స్పష్టత, దమ్ము, బేస్ తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ల వల్ల న్యూమోనియా, సైనస్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, గొంతు పచ్చి, తద్యారా బొంగురు గొంతు వస్తుంది. ఇలా ఎన్నో రకాలైన జబ్బులు శ్వాసమార్గంలో ఇబ్బందులు కలిగించి - మాట, పాట విషయంలో ఎన్నో సమస్యలొస్తాయి.
శ్వాస వ్యవస్థలో గాలి , మాటగా మారాలంటే గాలి ఎక్కువగా, ఏ ఇబ్బందులు లేకుండా కదలాలి. ఒప్పున్న ఏ కొప్పు పెట్టినా బాగానే ఉంటుంది. గాలి ఎక్కువ ఉండి, ఊపిరితిత్తులు బాగుంటే, బలంగా ఉంటే, భావోద్యేగాలు నియంత్రణలో ఉంటే, ఏ మాటైనా మంత్రమే, ఏ పాటైనా గాన గాంధర్యమే. ‘ఏ పాటలో చేరితే గాలి గాంధర్యమౌతున్నదో’ అన్నట్టుగా ఉంటుంది. శ్వాసకు, మాటకు, పాటకు అన్ని అంగాలు సహకరించాలి. ముఖ్యంగా స్వరపేటిక ( లారింక్స్: వాయిస్ బాక్స్) ఫారింక్స్, నాలుక, దంతాలు, పెదాలు, ప్యాలెట్, సైనస్‌లు, ముక్కు .. ఇలా అన్నీ .. వీణలో తీగలన్నీ సరిగ్గా ఉంటేనే వీణ మోగినట్టు శ్వాసవ్యవస్థలో అన్ని అవయవాలు సక్రమంగా, ఆరోగ్యంగా ఉంటేనే మన మాట బాగుంటుంది. ఆ మాటే మంత్రమై వినే వారిని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
శ్వాసకు ప్రకృతికి ఉన్న సంబంధం
మన మాటకు, మన శ్వాసవ్యవస్థకు (ముక్కు నుంచి ఊపితిత్తుల చివరి వరకు), తిరిగి శ్వాసవ్యవస్థకి మానసిక, శారీరక ఆరోగ్యానికి (దేహంలో ఉన్న అన్ని అవయవాలకు), మళ్లీ ఈ దేహ ఆరోగ్యానికి, ఈ దేశ ఆరోగ్యానికి (అంటే ఇక్కడ పరిసరాల ఆరోగ్యం), ఈ పరిసరాల ఆరోగ్యానికి, ప్రకృతి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది, ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినా, తెలియకపోయినా సరే అది ఉంటుంది. ప్రకృతి ఆరోగ్యం అంటే పంచభూతాల ఆరోగ్యం .. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం ( ఫైవ్ ఎలిమెంట్స్: ఎర్త్, ఎయిర్, వాటర్, సన్,(లైట్ రేడియేషన్)&స్పేస్).
భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం
ఈ ఆలోచనల సరళి మారాలన్నా, సమతుల్య అభివృద్ధి జరగాలన్నా, మన ఆలోచనలు, మాటలు, చేతలు సమూలంగా మారాల్సిందే. ఇది ఒకరిపై ఒకరు విమర్శించుకోవడానికో, యుద్దాలు చేయడానికో కాదు. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికీ, సఖ్యతతో కలిసి పనిచేయడానికి దారితీయాలి. తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు అందరం కారకులమే. అందరం ఆలోచించాల్సిదే, అందరం మంచి వైపు అడుగులు వేయాల్సిందే.
అపుడు ఈ భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం (ప్లానెట్ హెల్త్ ఈస్ పీపుల్స్ హెల్త్)గా మారుతుంది. లేదంటే ఈ పంచభూతాలే - భూతాలై, ప్రేతాలై మానవజాతికి మనుగడ లేకుండా చేస్తాయి. ఇది జరగాలంటే, మనందరి కల నెరవేరాలంటే దానికి ఒకటే పరిస్కారం సమతుల్య అభివృద్ధి వర్సెస్ సమఆరోగ్యం ( గ్రోత్ వర్సెస్ వెల్ బీయింగ్.. సైన్స్ వర్సెస్ స్పిరిట్యువాలిటీ). అభివృద్ధిలో అనారోగ్యం దాగి ఉంది. అనారోగ్యంతో కూడిన అభివృద్ధికి అర్థం ఉంటుందా? ఈ రెండు బొమ్మా బొరుసులాంటివి. అయితే వీటిని బాలన్స్ చేయడం ఎలా? సమాధానం ఏమిటి .. అంటే ..
సస్టెయినబుల్ గ్రోత్ విత్ స్పిరిట్యువల్ థింకింగ్.
ఒక ఆలోచనే ఒక యుద్ధం.
ఒక ఆలోచనే ఒక శాంతి మంత్రం.
పంచభూతాల ఆరోగ్యమే జీవకోటి ఆరోగ్యం.
అంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ పరస్పర ఆధారితం. ఒకటి లేకుండా ఇంకోటి లేదు. ఒకదాని ఉనికికి కారణం ఇంకొక దాని ఉనికి. అది జీవైనా, వస్తువైనా, అది ఏదయినా చివరికి ప్రకృతి అయినా, అంటే పంచ భూతాలైన. ఈ ప్రకృతిలో ఒకదాని మీద ఆధార పడకుండా ఇంకొక దానికి ఉనికీ లేదు, మనుగడే లేదు.. అది ఏది మనజాలదు. దేనికి స్వయం అంటే నేను (ఐ ) .. నేనే (ఐ ఓన్లీ ) నాది .. నాదే ( సెల్ఫ్ నేచర్) అనేది ఏదీ ఉండదు. అందుకే మాటకు మానసిక ఆరోగ్యానికీ, శ్వాసకు దేహంలోని ఇతర అవయవాలకు, పరిసరాల ఆరోగ్యానికి సంబంధం ఉంది.
మరి పరిసరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎలా .. మళ్లీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిదెంతా అనేది వేరే సబ్జెక్టు. మనిషి ఆలోచనల పర్యవసానమే అభివృద్ధి రూపాలు, అనర్ధాలు, విషమ పరిస్థితులు.. అదే పంచభూతాల కాలుష్య కారకం. అదే గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, వాతావరణ తాపం, గ్లోబల్ వార్మింగ్, వరదలు, ఉప్పెనలు, అడవుల వినాశనం (డీఫారేస్ట్రేషన్), శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, వ్యర్ధాల కాలుష్యం.. మొత్తానికి భూగోళమే ఒక వ్యర్థాల కూపంగా మారి అదే మనకు, మన ఆరోగ్యానికి శాపంగా మనకు, మన పిల్లల భవిష్యత్తుకు, ఇంకా మొత్తం భవిష్యత్ తరాలకు మనందరం కలిసి మరణ శాసనం లిఖిస్తున్నాం. దీనంతటికీ కారణం మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు, దాని పర్యవసానాలు. మొత్తానికి మనసే కాలుష్య కారకంగా (మైండ్ పొల్యూషన్) మారింది, మారుతున్నది, మార్చబడుతున్నది.