22-08-2025 02:27:38 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్
ఖైరతాబాద్; ఆగస్టు 21 (విజయ క్రాంతి) : ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీకి మాదిగ కులస్తులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్ మాదిగ తెలిపారు. ఈనెల 31న దాదాపు 200 మంది ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎం.ఆర్.పి.ఎస్ సీనియర్స్ మేదో మదన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ విద్య ఉద్యోగ రంగాల్లోనే జరిగిందని ఉపాధి రాజకీయ రంగాల్లో కూడా జరగాలని అన్నారు.ఎస్సీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి ని రాజీనామా చేయాలని మందకృష్ణ మాదిగ అనడాన్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అండగా నిలబడేది పోయి బిజెపి మాటలు విని వారికి భజన చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, రేవంత్ రెడ్డి ని అవమానించడం కృష్ణ మాదిగకు తగదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పోయిన కేసీఆర్ ను పళ్ళెత్తి మాట అనకుండా రేవంత్ రెడ్డి ని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. కృష్ణ మాదిగ భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ కోసం పని చేస్తే మంచిది కానీ ఎమ్మార్పీఎస్ ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టడం మంచిది కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం వ్యవస్థాపక అధ్యక్షురాలు మేరీ మాదిగ, మెదక్ జిల్లా అధ్యక్షులు రత్నయ్య, ఖమ్మం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు పాలడుగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.