17-05-2025 05:07:59 PM
రెండు నెలల్లో టూ టౌన్ కోసం ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం..
వారంలో ఐటీ పార్కు..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల నగర పాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు రూ. 78 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) తెలిపారు. శనివారం వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్, వెంకటేశ్వర టాకీస్, శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలలో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువలు, ఫుట్ పాత్ నిర్మాణ పనులను జూన్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయం దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు.
టూ టౌన్ కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి
మంచిర్యాల పట్టణంలోని లక్ష్మి థియేటర్ సమీపాన గల తన ఇంటి ముందు నుంచి టూ టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. 2027లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తానన్నారు. ఆసుపత్రిలో పేద వారికి ఆధునిక వైద్య సేవలు అందిస్థానని భరోసా ఇచ్చారు.
వారంలో ఐటీ పార్కు...
మంచిర్యాల కార్పొరేషన్ లోని వెంపల్లి ఇండస్త్రీయల్ పార్కు ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే పీ ఎస్ ఆర్ తెలిపారు. లే అవుట్, భూమి కేటాయింపు ఎలా అనే అంశాలపై నిర్ణయం తీసుకుని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్రయించడం జరుగుతుందన్నారు. ఐటీ పార్కులో తాను కూడా కోడి గుడ్ల ఎగుమతి, మామిడి, ఇతర పండ్ల నిలువ చేసే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ముల్కల్ల నుంచి గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రక్రియ జరుగుతోందని, అలాగే ఐటీ పార్కుకు అనుసంధానంగా బసంత్ నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు. రూ. 45 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చడం వల్ల విద్యార్థుల సంఖ్య 4,800 మందికి పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన నిర్ణయం నచ్చడంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పూనుకున్నారని తెలిపారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..
నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ తెలిపారు. బీఆర్ఎస్ లా జీఓలు తీసుకువచ్చి పాలాభిషేకం చేయడం లేదని, పక్కాగా నిధులు తీసుకువస్తున్నానని తెలిపారు. వచ్చే శాసన సభ ఎన్నికల ఏడాది ముందు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల్లో మమేకం అవుతానని తెలిపారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాల్సి ఉందని అన్నారు. నియోజక వర్గంలో ఆరు వేల మందికి రాజీవ్ యువ శక్తి పథకం అందిస్తానని హామీ ఇచ్చారు.