07-11-2025 12:16:33 AM
-జోరుగా ఇండ్ల విక్రయ దందా..!
-హాట్ కేక్‌లా క్వార్టర్ల విక్రయం
-ప్రేక్షకులుగా అధికారులు
-లక్షలు దండుకుంటున్న దళారులు
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ : బెల్లంపల్లిలో సింగరేణి ఇండ్ల విక్రయాల దందా జోరుగా సాగుతుంది... సింగరేణిలో ఒక వైపు ఖాళీ భూములను మింగుతోన్న కబ్జాదారులను ఎరిగాం.., మరో వైపు అక్రమార్కులు అవినీతిలో కొత్త కోణానికి తెరతీశారు... ఖాళీ గా ఉన్న సింగరేణి క్వార్టర్లను సైతం వదిలి పెట్టడం లేదు. వారి సొంత ఆస్తిలాగా సింగరేణి ఇండ్లను అమ్మేస్తోన్న మరో దందా ఒకటి బెల్లంపల్లిలో వెలుగులోకి వచ్చింది... ఖాళీ క్వార్టర్లు భద్రంగానే ఉంటాయని అధికారులు గాలికొదిలేశారు. అందులో శిథిలమైన సింగరేణి క్వార్టర్లులే కదా! అని అధికారులు క్వార్టర్ల భద్రతను మరీ తక్కువ చూశారు. పనికిరానివిగా కనిపించే క్వార్టర్లనే లక్ష్యంగా చేసుకొని ఆక్రమించి లక్షలు కమాయిస్తున్నారు కొంత మంది దళారులు...
బెల్లంపల్లి పట్టణంలోని 85 డీప్, శాంతిఖని, 65 డీప్, సుబాష్ నగర్ లో ఖాళీగా అనేక సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. ఇల్లీగల్ గా కొంత మంది ఇప్పటికీ అందులో నివా సం ఉంటున్నారు. సింగరేణి క్వార్టర్ల వేదికగా బెల్లంపల్లిలో ఈ అక్రమ దందా జోరుగా నడుస్తోంది. సింగరేణి కంపెనీ సరెండర్ చేసి న సింగరేణి క్వార్టర్లు హాట్ కేక్‌లా అమ్ముడు పోతున్నాయి. క్వార్టర్లకు డిమాండ్ అలా ఉం ది. ప్రాంతాన్ని బట్టి వాటి రేటు ఉంది.
బజార్ ఏరియాకు అనుకుని ఉన్న సింగరేణి కాలనీ ల్లో రూ. 10 లక్షలపై రేటు పలుకుతుంది. సింగరేణి క్వార్టర్ల సరెండర్ నేపథ్యంలో అధికారులు ముందు చూపుతో తమ భవిష్యత్తు అవసరాల నిమిత్తం పట్టణంలోని కొన్నికాలనీలోని క్వార్టర్లను తమ అదీనంలోనే ఉంచుకున్నారు. బెల్లంపల్లి శాంతిఖని మెగా ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాల పరంపరలో క్వార్టర్లను తమ అండర్ టెక్ లో పదిల పర్చుకున్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు క్వార్టర్లు, లేదా ఇతర అవసరాలు కోసం ఈ ఖాళీ క్వార్టర్లు, స్థలాలు పనికోస్తాయని యాజమాన్యం భవిష్యత్ అంచనా. ఈ దిశగా సింగరేణి ఎస్టేట్ అధికారులు కొత్తగూడెం నుంచి వచ్చి బెల్లంపల్లిలో సింగరేణి భూములపై సర్వే చేశారు.
దీనికి కారణం 2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పట్టణంలోని పురాతన సింగరేణి ఎస్సార్టీ క్వార్టర్లు, సింగరేణి స్థలాలలో నిర్మించుకున్న కార్మికుల సొంత ఇండ్లకు పట్టాలు, కార్మికులకు సొంతం చేయాలని అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంకల్పించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆమోదించి బెల్లంపల్లి సింగరేణి కార్మికుల చిరకాల సొంతింటి కలను నెరవేర్చారు. ఆ సందర్భంగానే బెల్లంపల్లిలో కార్పొరేట్ ఎస్టేట్ అధికా రులు, రెవెన్యూ అధికారులు సర్వే చేసి సింగరేణినికి అవసరమైన ఆస్తులను గుర్తించి మిగతా భూములు, సింగరేణి క్వార్టర్లను ప్రభుత్వానికి అప్పగించారు.
సింగరేణి అధీనంలో...
పాత సింగరేణి క్వార్టర్లు, కొంత మేర సింగరే ణి భూములు రెవెన్యూ శాఖకు అప్ప గించగా, మిగిలిన ఆస్తులు, భూములు సింగరేణి అధీనంలోనే ఉన్నాయి. 65డీప్ లోనీ పాత సింగరేణి డిస్పెన్సరీ వెనుక ఉన్న ‘సీ’ టైప్ క్వార్టర్లు, సుభాస్ నగర్, శాంతిఖని, 85 డీప్ ఏరియాలతో పాటు రామాలయం ఏరి యా, ఏఎంసీ, స్టేషన్ రోడ్ కాలనీ, తిలక్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న టేకులబస్తీ పాత డిస్పెన్సరీ ‘సీ’ క్లాస్ సింగరేణి క్వార్టర్ల కాలనీలు సింగరేణి ఖాతాలోనే ఉండిపోయాయి.
దర్జాగా క్వార్టర్ల ఆక్రమణ దందా..
సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్లను ఆక్రమించడమే తప్పంటే, వాటిని దర్జాగా అమ్మే స్తున్నారు. ఒక్కో క్వార్టర్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రేటు పలుకుతుంది. ఇలా అప్పనంగా క్వారర్లను అమ్మేస్తు లక్షలు దండుకుంటున్నారు. శాంతిఖని బస్తీలో వం దలాది సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. 85 డీప్ లోనీ మొత్తం 50 క్వార్టర్లను అమ్మకానికి పెట్టారు. ఈ వ్యవహారంలో కొందరు మాజీ కౌన్సిలర్ల పేర్లు ప్రముఖంగా ప్రచారంలో వినిపిస్తున్నాయి.
ఆయా కాలనీల్లో వారి వ్యవ హారమంతా వివాదాస్పదంగా మారినతీరుపై ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇంత యథేచ్చగా జరుగుతోన్న క్వార్టర్ల అక్రమ దందా అధికారులకు తెలియక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ముమ్మాటికి సింగరేణి అధికారుల పూర్తి పర్యవేక్షణ లోపానికి పరాకాష్ట. దీన్ని ఆసరా చేసుకుని కబ్జాకోరులు తమ పలుకుబడినీ ప్రయోగించి ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను ఆక్రమించి తెగనమ్ముతున్నారు.
ఈ అక్రమ దందా బెల్లంపల్లిలో కొంత కాలంగా సాఫీగా గుట్టుగా సాగుతోన్నది. సరైన నిఘా, చిత్తశుద్ధి కరువైపోవడంతో సింగరేణి క్వార్టర్లకు రక్షణ లేకు డా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. క్వార్టర్లను అమ్మేస్తున్న వైనం బెల్లంపల్లిలోప్రతీ వార్డులో కోడైకూస్తుంది. ఈ విషయం పై అధికారులు ఇప్పటికీ దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉంది. సింగరేణి ఆస్తుల పరిరక్షణపై అధికారుల్లో నెలకొన్న అలసత్వానికిది అద్దం పడుతోంది. అధికారుల తీరు అక్రమదారులకు పరోక్షంగా కలిసొస్తుందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. బెల్లంపల్లిలో అక్రమార్కుల భారిన పడి ఎంతో విలువైన సింగరేణి ఆస్తులు మగ్గిపోతున్నాయి.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. కాకుండా ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలి. క్వార్టర్ల విక్రయాలు, అక్రమణలకు సత్వరమే అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆలస్యం జరిగి పోయిందన్న విమర్శలు అధికారులపై ఉన్నాయి. ఇక అధికారులు ఎంత మాత్రం నిర్లిప్తతకు తావు ఇవ్వకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్లు దక్కుతాయి. తక్షణమే ఆక్రమణ కు గురైన క్వార్టర్లను స్వాధీనం చేసుకోవాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి ఆస్తుల రక్షణ గాలికి.. ?
సింగరేణి ఆస్తులు, క్వార్టర్లు అన్యాక్రాంతమవుతుంటే అధికారులు మాత్రం గుమ్మునంగా ఉండిపోతున్నారు. లక్షలు, కోట్ల విలువ చేసే సింగరేణి ఆస్తులు, పరిరక్షణ లోపం వల్ల చేజారీపోతున్నాయి. ఓ వైపు భూ అక్రమాలు, మరోవైపు సింగరేణి ఆస్తులను కాజేస్తూ కబ్జాదారులు సింగరేణికి సవాల్ గా మారిపోయారు. ఇన్ని అక్రమ దందాలు చేస్తోన్న వారిలో జంకూ బొంకూ బొత్తిగా కానరాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణి ఆస్తుల మీద అధికారుల శీతకన్ను సానుకూలతగా సొమ్ము చేసుకొని అక్రమా ర్కులు తెగరెచ్చిపోతున్నారు. అధికారులు ఏమిచేస్తారూ.. మహా అయితే కబ్జా చేసిన స్థలాలు లేదా క్వార్టర్లను తిరిగి స్వాధీనం చేసుకుంటారు. అంతకు తప్ప జరిగేదేమీ ఉండదని తెలుసు.
కబ్జాదారుల చర్యల నష్టమేమీ జరుగక పోవడంతో కబ్జాదారుల్లో మార్పుకు ఆస్కారం ఉండదు. దండన లేకపోవడం కబ్జాకోరుల్లో కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. వాస్తవానికి ఇలాంటి అక్రమాలకుగానూ సంబంధించిన వారిపై పర్సనల్‌గా చట్టపరమైన చర్యలు ఉండాలి. చర్యలు లేకపోవడంతో కబ్జాదారుల్లో అస్సలు భయం లేకుండా పోయింది. ఆక్రమణలకు అడ్డూ లేకుండా పోయింది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఆక్రమణలు, అందుకు కారకు లపై తగిన చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా చేస్తేనే సింగరేణి ఆస్తులకు ఏమైనా రక్షణ ఉంటోంది. అధికారులు ఏమిచేస్తారో చూడాలీమరి.