11-05-2025 12:32:18 AM
-ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వోవైసీ
-తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
-తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
ముషీరాబాద్, మే 10 (విజయక్రాంతి) : పాకిస్థాన్ దుశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుందని విమ ర్శించారు.
శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్ అలీ లతో కలిసి వోవైసీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశం నుండి విడిపోయిన తరువాత పాకిస్తాన్ ఇక్కడి హిందువులకు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. పెహాల్గామ్ లో కుటుంబ సభ్యుల ముందు అతికిరతకంగా హతమార్చారని, అందుకు ప్రతీకారం గా ఆపరేషన్ సింధూర్‌తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లిచుకుంటుందని ఒవైసీ అన్నారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. సైనికులకు అండగా ఉంటా మని ఒవైసీ స్పష్టం చేశారు. కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాలని అన్నారు.
అదే విధంగా ఇతర భాషలను కూడా గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.ఏ.మాజీద్, సయ్యద్ గౌస్ మోహినుద్దీన్, కోశాధికారి ఎం.ఏ.మోసిన్, కన్వీనర్లు ఖలీల్ పరహత్, అంజద్ అలీ పాల్గొన్నారు.