calender_icon.png 18 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర గ్రూపులకు మద్దతిస్తే పాకిస్థాన్ ఉనికికే ప్రమాదం

18-11-2025 12:14:57 AM

భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తే పాకిస్థాన్ ఉనికికే ప్రమాదమని, టెర్రర్ ముఠాల ప్రేరేపించి, ఎగదోయడం ఆ దేశం మానుకోవాలని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భారతదేశం ఎల్లప్పుడూ ప్రజలు, పురోగతి, శ్రేయస్సుపైనే దృష్టి పెడుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన 3వ చాణక్య డిఫెన్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులను, వారి మద్దతు దారులను భారత్ ఒకే విధంగా చూస్తోందని అన్నారు.

పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం నూతన పద్ధతులను అవలంబిస్తుందని పేర్కొన్నారు. భారత దేశం పురోగతిలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తుందని ద్వివేది చెప్పారు. చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని, రక్తం, నీరు కలిసి ప్రవహించబోవని పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ 88 గంటల్లో ముగిసిన ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం.

పాకిస్థాన్ అవకాశం ఇస్తే, పొరుగు దేశంతో ఎలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో నేర్పుతాం’ అని జనరల్ ద్వివేది తెలిపారు. ప్రస్తుతం బ్లాక్ మెయిళ్లకు తలొగ్గే పరిస్థితిలో భారత్ లేదని, శుత్రువులను అణచడానికి దేశం ఒక్కతాటిపై  పనిచేస్తోందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.