22-12-2025 12:08:53 AM
నేడు కొలువుదీరనున్న పంచాయితీ పాలకవర్గాలు
ప్రమాణ స్వీకారం చేయనున్న సర్పంచులు
ప్రత్యేక పాలన నుంచి పల్లెలకు విముక్తి
పాపన్నపేట, డిసెంబర్ 21 :గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు ఇటీవల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యం త్రాంగం పూర్తి చేసింది. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4220 వార్డు స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట, శంకరంపేట ఏ మండలాలకు కలిపి 160 గ్రామ పంచాయతీ స్థానాలు, 1402 వార్డు స్థానాలు ఉండగా అందులో కొన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించారు.
రెండ వ విడతలో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట్, శంకరంపేట ఆర్, మెదక్ మండలా లకు కలిపి 149 సర్పంచ్ స్థానాలు, 1290 వార్డు స్థానాలు ఉండగా ఏకగ్రీవమైనవి కాకుండా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించారు. చివరి విడతలో నర్సాపూర్, చిలప్చేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు కలిపి 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు స్థానాలు ఉండగా ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు మినహా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించిన విషయం విధితమే. వీటన్నిటికీ సంబంధించి సోమవారం ఆయా గ్రామపంచాయతీలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2 నెలలు తక్కువ 2 సంవత్సరాలుగా అంటే 22 నెలల తరువాత ప్రత్యేక అధికారుల నుంచి పల్లె పాలన విముక్తి కాబోతోంది. గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నికలు జరిగే వరకు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రవేశపెట్టింది. జిల్లాలో మూడు విడుతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కొంగొత్త పాలనకు పంచాయతీలు ముస్తాబవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున 18న గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
నేడే సర్పంచ్ల ప్రమాణ స్వీకారం...
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండల్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఈనెల 22వ తేదీని ముహూర్తం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకా లను విడుదల చేసింది. దీంతో సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణం చేయించడానికి పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త పంచాయతీలు కొలువుదీరిన అనంతరం మొదటి సమావేశం జరగనుంది.