10-05-2025 01:15:22 AM
కరీంనగర్, మే 9 (విజయ క్రాంతి): కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రేషన్ షాపుల కేటాయింపు కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల 10న శనివారం ఫలితాల జాబితా ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నా నమ్మకం సన్నగిల్లింది. తొలుత ఏప్రిల్ 30న రేషన్ షాపు డీలర్ పోస్టుల ప్రకటన ఉంటుందని ప్రకటించారు. తర్వాత మే 3న వెల్లడించబడ కాయని ప్రకటించారు. ఆశావహులు ఆర్డీవో కార్యాల యానికి వచ్చి ఫలితాల కోసం వాకబు చేయగా మళ్లీ తేదీ ప్రకటిస్తామని చెప్పారు.
మే 10న ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. 1:5, 1:3 పద్ధతిలో పరీక్షా ఫలితాల ద్వారా ఎంపిక చేస్తారని, ఇలా ఎంపిక చేసినవారి నుండి ఒకరికి అవకాశం ఉంటుం దని చెబుతుండడంతో రేషన్ షాపు డీలర్ కోసం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 68 డీలర్ షాపులకు నోటిఫికేషన్ జారీ చేశారు. గంగాధర మండలం లోని ర్యాలపల్లి, ఉప్పరమల్యాల-1, ఉప్పరమల్యాల-2, తాడిజెర్రి, నారాయణపూర్, మానకొండూర్ మండలం అన్నారం, ఖాదర్ గూడెం, గంగిపెల్లి, మానకొండూర్- 1, మానకొండూర్-2, పచ్చునూరు, శంషాబాద్, వేగురుపల్లి, నిజాయితీగూడెం, చొప్పదండి మండలంలోని చొప్పదండి. గుమ్లాపూర్, కాట్నపల్లి, కొమురవెల్లి, గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి, యాస్వాడ, చొక్కారావుపల్లి, కొత్తపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, కొత్తకొండాపూర్, కరీంనగర్ పట్టణంలోని షాషామహల్ రోడ్, మార్కెట్ రోడ్, హుస్సేనురా, భాగ్యనగర్, మార్కండేయనగర్, టెలిఫోన్ క్వార్టర్స్, విద్యానగర్, రాంనగర్, గోదాంగడ్డ, కోరా స్కూల్, విద్యానగర్ డీలర్ షాపుల కోసం ప్రకటించిన రిజర్వేషన్ల వారీగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరీక్ష నిర్వహించారు.
10వ తరగతి ఆపైన చదివి ఉండి 18 సంవత్సరాలు నిండినవారి నుండి దరఖాస్తులు ఆహ్వానించి పరీక్ష నిర్వహించారు. వెయ్యి మందికిపైగా పరీక్ష రాశారు. అయితే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు ప్రకటించిన అనంతరం మార్కులవారీగా ఎంపికైనవారి నుండి ఇంటర్వ్యూ నిర్వహించి కేటాయిస్తారా లేక పైరవీలకు పెద్దపీట వేస్తారా చూడాలి.