17-08-2024 12:05:43 AM
మంచిర్యాల, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఎకరా భూమి రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్ రూ.70వేలు డిమాండ్ చేయడంతో రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో జరిగింది. నెన్నెల మండలం గొల్లపల్లి శివారులో దమ్మ సునితకు చెందిన 6.37 ఎకరాల భూమిని గొల్లపల్లికి చెందిన చింత విఘ్నేష్, చింత విష్ణు కొనుగోలు చేశారు. వారం రోజు ల క్రింతం రిజిస్ట్రేషన్ కోసం మీ సేవలో స్లాట్ బుక్ చేయించుకొని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేయకుండా తహసీల్దార్ రమేశ్ తమను ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నాడని విఘ్నేష్, విష్ణు ఆరోపించారు. శుక్రవా రం వెళ్లి తహసీల్దార్ రమేష్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా ఎకరానికి రూ.70 వేల చొప్పున లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని తేల్చి చెప్పాడని ఆరోపించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్ర ం కుటుంబసభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాతో విఘ్నేష్, విష్ణు కుటుంబసభ్యులు నిరసన తెలిపారు.
తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెన్నెల ఎస్సై ప్రసాద్ సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితుల వద్ద నుంచి పురుగుల మందు డబ్బా లాగేశారు. తహసీల్దార్‌తో మాట్లాడించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో శాంతించారు. ఈ విషయమై తహసీల్దార్ సబ్బా రమేశ్‌ను వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్‌కు ఇందూరి రాజేశ్వర్‌రావు అబ్జక్షన్ చేస్తూ ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి చేస్తామని చెప్పినా వినకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆందోళన చేశారని చెప్పారు. తాను డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు.