13-10-2025 01:10:40 AM
భారీ టార్గెట్ ఛేజ్ చేసిన ఆసీస్ కెప్టెన్ హీలీ విధ్వంసం
విశాఖపట్నం,అక్టోబర్ 12: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యా టింగ్‌లో అదరగొట్టి 330 రన్స్ చేసినా ఆ స్కోరును కాపాడుకోలేకపోయింది. ఈ టో ర్నీలో భారత్‌కు వరుసగా ఇది రెండో ఓటమి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రతీకా రావల్,స్మృతి మంధాన మెరుపు ఆరంభాన్నిచ్చారు. స్మృతి తొలిసారి ఈ టోర్నీలో మెరుపులు మెరిపించింది. కేవ లం 66 బంతుల్లోనే 80(9 ఫోర్లు,3 సిక్సర్లు) పరుగులతో అదరగొట్టింది. ప్రతీకా రావల్ 96 బంతుల్లో 75(10 ఫోర్లు,1 సిక్సర్) పరుగులతో రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 155 పరుగులు జోడించారు.తర్వాత హార్లిన్ డియోల్(38), జెమీమా(33),రిఛా ఘోష్(32) ధాటిగా ఆడగా... హర్మన్ ప్రీత్ (22) పరుగులు చేసింది. చివర్లో భారత్ 36 పరుగుల తేడాలో 6 వికెట్లు చేజార్చుకుంది.
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయి తే పెర్రీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం..తర్వాత బెత్ మూనీ, అన్నాబెల్ త్వరగానే ఔటవడంతో మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించేలా కనిపించింది. కానీ ఆసీస్ కెప్టెన్ హీలీ ఏమా త్రం అవకాశమివ్వకుండా విధ్వంసకర ఇ న్నింగ్స్ ఆడింది.84 బంతుల్లోనే సెంచరీ బాదేసింది. హీలీ 142(107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులకు ఔటయింది.తర్వాత భారత బౌలర్లు వరుసగా మ రో వికెట్లు తీసినప్పటకీ... రిటైర్డ్ హర్ట్‌గా వెళ్ళిన పెర్రీ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చింది. కిమ్ గార్త్‌తో కలిసి ఆసీస్‌ను గెలిపించింది.
స్కోర్లు: భారత్ ఇన్నింగ్స్: 330 (ప్రతీక 75, స్మృతి 80,హార్లిన్ 38; అన్నాబెల్ 5/40)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 331/7 (49 ఓవర్లు)(హీలీ 142, పెర్రీ 47 నాటౌట్, గార్డ్‌నర్ 45; శ్రీచరణి 3/41,దీప్తి 2/52)