calender_icon.png 12 December, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు

11-12-2025 11:49:06 PM

లక్షెట్టిపేట, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట మండలంలో రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. లక్షెట్టిపేటలోని 18 జీపీలకు 46 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మండలంలో 25,227 (పురుషులు 12,261, మహిళలు 12,966) ఓట్లు ఉండగా ఉదయం తొమ్మిది గంటల వరకు 5,794 (23%), 11 గంటల వరకు 14,026 (56%), ఒంటి గంట వరకు 20,440 (81.02%), ఒంటి గంట అనంతరం క్యూలో నిలబడిన వారు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ 20,771 (82.34%)కి చేరుకుంది. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 9,962 (81.25%) పురుషులుండగా, 10,309 (83.36%) మహిళలు ఉన్నారు. 

విజయం సాధించిన సర్పంచులు వీరే...

లక్షెట్టిపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలకు 46 మంది అభ్యర్థులు సర్పంచు పదవి కోసం పోటీపడ్డారు. ఇందులో చందారం గ్రామ సర్పంచిగా ఇస్లావత్ ఉత్తమ్ (కాంగ్రెస్) విజయం సాధించగా దౌడపల్లిలో తీర్థాల వెంకటేష్ (కాంగ్రెస్), హన్మంతుపల్లిలో చిందం మల్లేష్ (కాంగ్రెస్), కొత్త కొమ్ముగూడెంలో సందెల సుజాత (కాంగ్రెస్), రంగపేటలో ముల్కల్ల రాందాస్ (కాంగ్రెస్), సూరారంలో అన్నవేణి బానేష్ (కాంగ్రెస్), తిమ్మాపూర్ లో ముత్తే శైలజ (కాంగ్రెస్), అంకత్ పల్లిలో లింగంపల్లి వెంకటేష్ (కాంగ్రెస్), ఎల్లారంలో గొడిసెల రాజేశం (బీఆర్ఎస్), పాత కొమ్ముగూడెంలో దుమ్మని సత్తన్న (కాంగ్రెస్), జెండా వెంకటాపూర్ లో ఎల్తపు సుధాకర్ (బీఆర్ఎస్), గుల్లకోటలో దేవి భీమయ్య (ఇండిపెండెంట్), మిట్టపల్లిలో శాతరాసి బానేష్ (కాంగ్రెస్), వెంకట్రావుపేటలో నలిమెల రాజు (కాంగ్రెస్), కొత్తూరులో నల్లపు పోచమల్లు రజిత (కాంగ్రెస్ రెబల్), బలరావుపేటలో మండే తిరుమల గణపతి (బీఆర్ఎస్), పోతపల్లి గ్రామ పంచాయతీలో నైనాల లక్ష్మీ (బీఆర్ఎస్) విజయం సాధించారు. లక్షెట్టిపేట మండలంలో 160 వార్డులుండగా 32 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 128 వార్డులకు ఎన్నికలు జరుగగా 324 మంది సభ్యులు పోటీపడ్డారు.