12-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాం, ఇంటింటికీ 24 గంటల మంచినీరు ఇస్తాం అని ప్రగల్భాలు పలికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దలకు.. సొంత ఆఫీసులో నీటి కష్టాలు తీర్చడం చేతకావడం లేదు. నగర ప్రజల దాహార్తిని తీర్చాల్సిన బల్దియా ప్రధాన కార్యాలయంలోనే గత రెండు రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.
ట్యాంక్ బండ్ పక్కన ఠీవిగా కనిపించే ఈ పరిపాలనా భవనంలో బుధవారం మధ్యాహ్నం మొదలైన నీటి సమస్య గురువారం రాత్రి వరకు పరిష్కారం కాకపోవడంతో అధికారులు, సిబ్బంది, సందర్శకులు అల్లాడిపోయారు.
జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసులో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏడవ అంతస్తు వరకు నీటి సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. మోటార్లు మొరాయించాయో, పైపులైన్లు పగిలాయో తెలియదు కానీ కార్యాలయంలోని ఏ ఒక్క నల్లాలోనూ చుక్క నీరు రాలేదు. మేయర్ విజయలక్ష్మి, కమిషనర్, అదనపు కమిషనర్లు, విభాగాధిపతులు కొలువుదీరే భవనంలోనే 24 గంటలకు పైగా నీటి సరఫరా నిలి చిపో వడం బల్దియా పనితీరుకు అద్దం పడుతోంది.
మహిళా ఉద్యోగులకు నరకం
నీటి సరఫరా లేకపోవడంతో భవనంలోని వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు అధ్వానంగా తయారయ్యాయి. నీళ్లు లేక ఫ్లష్‌లు పని చేయక, దుర్వాసన వెదజల్లుతుండటంతో కారిడార్లలో నడవడమే కష్టంగా మారింది. ముఖ్యంగా వందలాదిగా ఉన్న మహిళా ఉద్యోగులు వాష్‌రూమ్‌లకు వెళ్లలేక, బయటకు చెప్పుకోలేక నరకం అనుభవించారు. అత్యవసర పరిస్థితుల్లో పక్కనే ఉన్న వేరే భవనాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
నగర నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం, జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం, టౌన్ ప్లానింగ్ పనుల కోసం హెడ్ ఆఫీసుకు వచ్చే సామాన్య జనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాహం వేస్తే మంచి నీళ్లు దొరక్క, టాయిలెట్లకు వెళ్లే దారిలేక వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊరందరికీ నీళ్లు పోస్తున్నామంటారు.. ఇక్కడేమో గొంతు తడుపుకోవడానికి కూడా దిక్కులేదు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలం
సాధారణంగా నగరంలో ఎక్కడ నీటి సమస్య వచ్చినా వాటర్ ట్యాంకర్లు పంపించే జీహెచ్‌ఎంసీ.. తన సొంత ఆఫీసులో నీళ్లు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. సమస్య మొదలై 30 గంటలు దాటుతున్నా కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని నింపే ప్రయత్నం చేయలేదని ఆరోపిస్తున్నారు.
చేతులు కడుక్కోవడానికీ నీళ్లు లేవ్..
నీటి కొరత కారణంగా ఉద్యోగులు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. బుధవారం, గురువారం మధ్యాహ్న సమయాల్లో లం చ్ చేద్దామంటే కనీసం చేతులు కడుక్కోవడానికి, ప్లేట్లు శుభ్రం చేసుకోవడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నెలకొంది. చాలామంది సిబ్బంది తెచ్చుకున్న లంచ్ బాక్సు లను అలాగే వెనక్కి తీసుకెళ్లారు. మరికొందరు ఆకలికి తట్టుకోలేక క్యాంటీన్లలో కొనుక్కున్న వాటర్ బాటిళ్ల నీటితో చేతు లు కడుక్కుని భోజనం కానిచ్చారు. చిన్న చిన్న అవసరాలకు కూడా బయట నుంచి నీళ్లు కొనుక్కోవాల్సి రావడంతో సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.