calender_icon.png 5 September, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో త్వరలోనే రోడ్డు విస్తరణ

05-09-2025 12:55:28 AM

-కసరత్తులో పురపాలక శాఖ అధికారులు

-ఆందోళనలో వ్యాపార వర్గాలు

-స్వచ్ఛందంగా నిర్మాణాలకు తొలగించుకోవాలని పలువురికి నోటీసులు

బెల్లంపల్లి, సెప్టెంబర్ 4: బెల్లంపల్లిలో త్వరలోనే రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్లు పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి మొదలుకొని బెల్లంపల్లి కాంటా చౌరస్తా వరకు మూడు దశల్లో రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు కసరత్తులు చేపడుతున్నారు.

ఇప్పటికే నిర్మాణదారులకు పురపాలక శాఖ అధికారు లు నోటీసులు కూడా జారీ చేశారు. అధికారుల చర్యలతో నోటీసులు అందుకున్న వ్యా పారులు, రోడ్లపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదించిన స్థలాల్లో నిర్మాణాలు పొంది ఉన్న యజమానులు స్వతహాగా తొలగించుకుంటుండగా మరి కొంతమంది తమ సంస్థల నిర్మాణాలను రోడ్డువిస్తరణ పనుల్లో నుంచి మిన హాయించాలని పురపాలక శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

మూడు దశల్లో విస్తరణ పనులు...

బెల్లంపల్లిలో చేపట్టనున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను మూడు దశల్లో చేపట్టనున్నారు. టియుఎఫ్‌ఐడియుసి నుంచి రూ 9.7 కోట్ల నిధులతో ఈ విస్తరణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి పురపాలక శాఖ కార్యాలయం వరకు రూ. 2 కోట్లు, పురపాలక శాఖ కార్యాలయం నుంచి ఏఎంసి చౌరస్తా వరకు రూ. 2 కోట్లు, ఏఎంసి చౌరస్తా నుంచి కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు రూ. మరో 2.7 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కాంటా చౌరస్తాను మరింత అభివృద్ధి చేయనున్నారు. ఆగస్టు 24న ఎమ్మెల్యే గడ్డం వినోద్ చౌరస్తా అభివృద్ధి పనులకు భూమి పూజ కూడా చేశారు.

పలు సంస్థలకు నోటీసులు జారీ 

బెల్లంపల్లి పట్టణంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పురపాలక శాఖ అధికారులు ఇప్పటికే పలు సంస్థల నిర్వాహకులతో పాటు దేవాలయాలకు నోటీసులు అందించారు. అయ్యప్ప స్వామి దేవాలయం, చౌడేశ్వరి దేవాలయ కాంప్లెక్స్, బాలాజీ సినిమా ధియేటర్, సింగరేణి కళా వేదిక ఫంక్షన్ హాల్, సింగరేణి వర్క్ షాప్ లకు విస్తరణ చేపట్టే స్థలాల్లో నిర్మాణాలను కొంతమేర తొలగించాలని పురపాలక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చౌడేశ్వరి దేవాలయ కాంప్లెక్స్ నిర్వాహకులు కొంత మేరకు నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు.

వ్యాపారుల ఆందోళన.. 

పట్టణంలో చేపట్టే 100 ఫీట్ల రోడ్డుతో రెండువైపులా ఉపాధి కోల్పోతామని చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పేరుతో రోడ్లను విస్తరించి తమ జీవనోపాధిని దెబ్బతీయ వద్దని అధికారులను కోరుతున్నారు. పట్టణంలోని బెల్లంపల్లి బస్తి, శిశుమందిర్ బస్తీలలో చేపట్టే రోడ్డు విస్తరణ పనులను 60 ఫీట్లకు ప్రతిపాదించగా, 30 నుంచి 40 ఫీట్ల మేర చేపట్టాలని స్థానిక వ్యాపారులు, గృహ నిర్మాణదారులు, పురపాలక శాఖ అధికారులను వేడుకుంటున్నారు.

బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు అధికారులు సంసిద్ధమవుతుండగా మెయిన్ బజార్ లో ఇరువైపుల వ్యాపారాలు నిర్వహిస్తున్న 165 దుకాణాల యజమానులకు పురపాలక శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాం శమైంది. గతంలో సింగరేణి ఆధీనంలో ఉన్న ఈ దుకాణాలు పట్టణానికి చెందిన వ్యాపారులకు స్వల్ప అద్దెతో కేటాయించారు. సింగరేణి లీజు పీరియడ్ ముగియడంతో సింగరేణి ఆధీనంలోని దుకాణాలను యాజమాన్యం ప్రభుత్వానికి అప్పగించింది.

కాగా దుకాణాల్లో అద్దెకు ఉంటున్న వ్యాపారులు వాటిపై ఇంటి నెంబర్లు పొంది పట్టాలు చేసుకున్నారు. బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజావాణిలో కొంతమంది ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచా రించి వివరాలు సేకరించాల్సిందిగా పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.

దీంతో 165 మంది దుకాణదారులకు యాజమాన్యకు హక్కు ఎలా పొందారో తెలపాలని , దుకాణాలకు సంబంధించిన పత్రాలను చూపించాలని పురపాలక శాఖ అధికారులు నోటీసులు అందజేశారు.  దుకాణాలను తమ ఆధీనంలోకి తీసుకొని భవిష్యత్తులో మెయిన్ బజార్  ప్రాంతాన్ని కూడా విస్తరించే ప్రయత్నాలు చేపడతారేమోనని స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. 

పురపాలక శాఖ అధికారులు మాత్రం వ్యాపారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, తమ దుకాణాలకు సంబంధించిన పత్రాలను చూపించాలని, దుకాణాల వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని చెబుతున్నారు.