18-09-2025 12:00:00 AM
-రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
-కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
నిర్మల్, సెప్టెంబర్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ముందుగా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం, తెలంగాణ గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసంగిస్తూ, జిల్లాలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరిందని తెలిపా రు.
జిల్లా అభివృద్ధికి అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. అనంతరం భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు. స్వచ్ఛతాహి సేవ 2025లో భాగంగా నిర్వహిస్తున్న ‘స్వచ్చోత్సవ్ - పక్షోత్సవ్’ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి చైర్మన్ ఆవిష్కరించారు. అనంతరం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు.
వేడుకల అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న చైర్మన్, ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమర్థంగా వ్యవహరించిన జిల్లా అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ రాజేష్ మీనా, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.