18-09-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): బంజారాహిల్స్ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్ బస్తీ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. తమ పిల్లల చదువు కోసం ఓ ప్రభుత్వ పాఠశాల కావాలన్న వారి చిరకాల వాంఛ, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రత్యేక చొరవతో సాకా రం కానుంది. పాఠశాల నిర్మాణం కోసం అవసరమైన విలువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, దాన్ని విద్యాశాఖకు అప్పగించడం తో బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది.
ఏడు వేలకు పైగా జనాభా నివసించే శ్రీరామ్‌నగర్ బస్తీలో ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో అక్కడి పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లడమో లేదా ఆర్థిక భారంతో ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించడమో చేయాల్సి వచ్చేది. ఈ సమస్యను స్థానికులు మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి తీసుకురాగా, ఆమె స్పందించారు.
విద్యాశాఖ అధికారులతో మాట్లాడగా, పాఠశాల నిర్మాణానికి తగిన స్థలం అందుబాటులో లేదని తెలిపారు. పాఠశాల కోసం అనువైన ప్రభు త్వ స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులతో పలు దఫాలుగా మేయర్ సమీక్షలు జరిపారు. ఆమె కృషి ఫలించి, బస్తీకి సమీపంలోనే సుమారు రూ.4 కోట్ల విలువైన 240 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు.
అధికారికంగా భూమి అప్పగింత
బుధవారం శ్రీరామ్ నగర్ కాలనీ వాసు ల సమక్షంలో షేక్‌పేట రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలానికి సంబంధించిన పత్రాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి చేతుల మీదుగా విద్యాశాఖ అధికారులకు అధికారికంగా అందజేశారు. త్వరలోనే కలెక్టర్ నిధు లతో ఈ స్థలంలో పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఇక్కడ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
మేయర్‌కు రుణపడి ఉంటాం శ్రీరామ్‌నగర్ కాలనీ వాసులు
మా బస్తీలో బడి కోసం దశాబ్దాలుగా ఎందరో ప్రజాప్రతినిధులను, అధికారులను కలిశాం. కానీ మా గోడు ఎవరూ పట్టించుకోలేదు. మా పిల్లలు చదువుకోవాలంటే కిలోమీటర్లు నడవాలి, లేదంటే వేలకు వేలు పోసి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించాలి. ఈ భారం మోయలేక చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. మా కష్టాన్ని మేయర్ విజయలక్ష్మి గారు అర్థం చేసుకున్నారు. ఆమె దృష్టికి తీసుకెళ్లగానే, ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా కలను నిజం చేశారు. మా బస్తీ ప్రజలంతా ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.