30-08-2025 12:00:00 AM
కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు,ఆగస్టు29(విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిందని జిల్లాలోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గోదావరి పరివాహక మండలాలైన వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఉదృతంగా పారుతున్న గోదావరి కారణంగా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, శుక్రవారం మధ్యాహ్నం వరకు గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఐదు మండలాలలోని గ్రామాల ప్రజలు పశువులను మేతకు తీసుకుపోవద్దని, చేపల వేటకు వెళ్ళవద్దని, ప్రవహిస్తున్న నీటిలో ఈత కొట్టరాదని అన్నారు. జిల్లాలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వర్షాకాలం, వరదల దృష్ట్యా తక్షణ సహాయానికి కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109కు కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబం ధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.