14-08-2025 01:26:21 AM
- మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు
- రాజస్థాన్‌లోని దౌసాలో ఘటన
జైపూర్, ఆగస్టు 13: రాజస్థాన్‌లోని దౌసా రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. అందులో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఖాఠుశ్యామ్‌జీ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
మృతుల్లో ఎక్కువ మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ప్యాసింజర్ వ్యాన్‌ను కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ స్పందించారు. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.