14-08-2025 01:25:01 AM
-ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్ కౌంటీలో ఘటన
-దాడి చేసిన ఖలిస్థానీ వేర్పాటువాదులు
-స్పందించిన ఇండియన్ కాన్సులేట్
న్యూఢిల్లీ, ఆగస్టు 13: అమెరికాలోని ఇం డియానా రాష్ట్రంలోగల జాన్సన్ కౌంటీలో ఉన్న అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు మంగళవారం దాడి చేశారు. ఖలిస్థానీకి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా పలు నినాదాలను దేవాలయ గోడలపై రాసినట్టు ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్‌లో వెల్లడించింది.
భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వేషపూరిత విధ్వంసాలను తా ము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించిం ది. ఈ ఏడాదిలో అమెరికాలోని హిందూ దేవాలయాలపై దాడులు చేయడం ఇది నాలుగోసారి. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఖండించిన కాన్సులేట్
చికాగోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఇండియానాలోని గ్రీన్‌వుడ్‌లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయం ప్రధాన సైన్ బోర్డును అపవిత్రం చేయడాన్ని ఖండిస్తున్నాం. సత్వర చర్యల కోసం కాన్సులేట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
కాన్సుల్ జనరల్ భక్తులు, స్థానిక నాయకులు, గ్రీన్‌వుడ్ మేయర్‌తో సమావేశమయ్యారు’ అని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పేర్కొంది. మార్చి నెలలో కాలిఫోర్నియాలోని ఓ హిందూ ఆలయంపై కూడా ఇలాగే దుండగులు దాడి చేసి.. పిచ్చి రాతలు రాశారు.