26-07-2025 06:14:59 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సై జి. మహేష్(SI Mahesh) శనివారం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మండల కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వాగులు, కాలువలు, చెరువులు, ట్యాంకులు, లోతట్టు ప్రాంతాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని ఎస్సై హెచ్చరించారు. ప్రజలు నీరు నిలిచే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఆయన అన్నారు.
నీటి ప్రభావం అధికంగా ఉన్నా కాలువలు దాటే ప్రయత్నం చెయ్యకూడదని, నీటి ప్రభావం అధికంగా ప్రవహిస్తోంది, కాబట్టి ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని వర్షం వల్ల విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. అత్యవసర సహాయం కొరకు వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేష్ ప్రజలకు సూచించారు. పిల్లలను ఆట ఆడుకోవడానికి నీటి ప్రదేశాలకు వెళ్లనివ్వవద్దని ఆయన కోరారు. శిథిలావస్థలో ఉన్న, పాత భవనాల్లో నివసించవద్దని, అవసరమైతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఎస్సై సూచించారు. ప్రజలకు ఏదైనా సహాయం అవసరమైతే పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎస్సై మహేష్ అన్నారు.