calender_icon.png 27 July, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి

26-07-2025 06:18:42 PM

జిల్లాలో ప్రమాదకరమైన పరిస్థితులు లేవు... కలెక్టర్ బి.ఎం. సంతోష్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. రవి ఐఏఎస్

గద్వాల టౌన్: జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. రవి ఐఏఎస్(District Special Officer G. Ravi IAS) సూచించారు. శనివారం జిల్లా ప్రత్యేక అధికారి జి. రవి  ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాలు కురుస్తున్నందుకు జిల్లాలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రమాదాలు జరగకుండా గమనిస్తూ ఉండాలన్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రజలు వెళ్లకుండా దారి మళ్ళించాలని అందుకు ఫ్లెక్సీ, బ్యారికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా,  విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, త్రాగునీరు కలుషితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లాలో ప్రమాదకరమైన పరిస్థితులు లేవు.... కలెక్టర్ బి.ఎం. సంతోష్

జిల్లాలో మామూలు సాధారణ వర్షపాతం నమోదైనదని,  ప్రమాదకరమైన పరిస్థితులు లేవని కలెక్టర్ బి.ఎం. సంతోష్ తెలిపారు.  అయినప్పటికిని జిల్లాలోని అన్ని మండలాలలో ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న పాత గృహాలు, పాఠశాలలు, కళాశాలలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరమ్మతులను ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కృష్ణ, తుంగభద్ర పరివాహక ప్రాంతాలలో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు. 

త్రాగునీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లీకేజీలను సరి చేయడంతో పాటు క్లోరినేషన్ చేయడం జరుగుతుందని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఫ్రైడే ఫ్రైడేగా నిర్వహిస్తూ, మురికి కాల్వలను పరిశుభ్రం చేయడం జరుగుతుందని, రోడ్లపై మురికి నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. డెంగు మలేరియా చికెన్ గునియా లాంటి వ్యాధులు ప్రబలకుండ అన్ని తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలోని హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని వారికి అవసరమైన యూరియా, ఫర్టిలైజర్ లను అందుబాటులో ఉంచమని తెలిపారు. 

ప్రస్తుతము జిల్లాలో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని జిల్లాలో ఇప్పటికే 6052 కొత్త కార్డులు మంజూరు చేసి గ్రామ సభలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  రేషన్ కార్డులలో దాదాపు 29 వేల మంది పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందన్నారు. పోలీసు శాఖ కూడా అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని, సాధారణ వర్షపాతం నమోదు అయినందున ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ ప్రగతి, జిల్లా పంచాయతీ అధికారి నాగేంద్రం, పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ భాష, డి.ఎస్.పి. మొగులయ్య,  తదితరులు పాల్గొన్నారు.