23-10-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రికార్డు స్థాయి నామినేషన్లతో హోరెత్తిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఇప్పుడు వడపోత ప్రక్రియ మొదలైం ది. బుధవారం చేపట్టిన నామినేషన్ల స్క్రూ ట్నీలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. సరైన పత్రాలు సమర్పించని కారణం గా దాదాపు 30 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.
భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొ త్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఉద యం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్క్రూటినీ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 69 మంది అభ్యర్థులకు చెందిన 131 నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా, అందులో 39 మంది అభ్యర్థుల నామినేషన్లను 72 సెట్లు ఆమోదించారు.
సరైన క్రమంలో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో 30 మంది అభ్యర్థులకు చెంది న 59 సెట్ల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, తిరస్కరణకు గుర య్యే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
నిబంధనల ప్రకారం పకడ్బందీగా స్క్రూటినీ చేపట్టాలని ఆయన రిటర్నింగ్ అధికారి పి. సాయిరాంకు సూచించారు. మరోవైపు, పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి నియోజకవర్గంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన పలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేశారు. భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నందున, జూబ్లీహిల్స్ తుది బరిలో ఎంత మంది నిలుస్తారనే దానిపై శుక్రవారం సాయంత్రానికి పూర్తి స్పష్టత రానుంది.