17-08-2025 10:22:33 PM
మంత్రి ఈ గుంతల్లో నడుస్తరా?
హుస్నాబాద్ లో నాట్లు వేసి నిరసించిన ప్రజలు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని రెడ్డికాలనీ వాసులు ఆందోళన బాట పట్టారు. గుంతలమయమైన రోడ్లు, వరద నీటితో బురదగా మారిన వీధులు, ప్రజల ఇబ్బందులు ఇవేవీ పట్టించుకోని అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్లపై ఉన్న వరద నీటిలో నాట్లు వేసి ప్రభుత్వానికి తమ బాధను తెలియజేశారు. రెడ్డికాలనీతో పాటు పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడు నెలల క్రితం శంకుస్థాపన చేసినప్పటికీ, ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారం కోసమే శంకుస్థాపనలు, ప్రజల ఇబ్బందులు పట్టవా..?
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ... హుస్నాబాద్ పట్టణంలోని చాలా వార్డుల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా 2వ, 14వ వార్డులలో రోడ్లు వందల గుంతలతో నిండిపోయాయని, ప్రజలు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టూ వీలర్స్ లాంటి వాహనాలపై ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని అన్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీల కోసం రూ. 50 లక్షల నిధులను కేటాయించి మంత్రి శంకుస్థాపన చేసినా, ప్రచారం కోసమే ఆర్భాటంగా కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప, పనులు మాత్రం ప్రారంభించడం లేదని మండిపడ్డారు.
ఉత్త మాటలే తప్ప చేతల్లో శూన్యం
'హుస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యం' అని మల్లికార్జునరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంత్రి ఉదయం వాకింగ్ పేరుతో కేవలం మెయిన్ రోడ్లలో మాత్రమే తిరుగుతున్నారని, చిన్న చిన్న కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మంత్రి స్పందించి శంకుస్థాపన చేసిన పనులను తక్షణమే ప్రారంభించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని హెచ్చరించారు.