21-11-2025 12:25:41 AM
- హైదరాబాద్ జీడిమెట్లలో నిందితుల అరెస్ట్
- వివరాలు వెల్లడించిన ఎస్పీ కె.నరసింహ
సూర్యాపేట, నవంబర్ 20 (విజయక్రాంతి): ఓ హత్య కేసులో 9 మంది నిందితులను హైదరాబాదులోని జీడిమెట్ల ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన గురువారం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 15వ తేదీన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి టేకుమట్ల నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పిల్లలమర్రి గ్రామ శివారులో రోడ్డు పక్కన అనుమానస్పద స్థితిలో ఉన్న సుమారు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతి దేహాన్ని సంచిలో కట్టి చిన్న కాలువలో పడేశారు, సమాచారంను తెలుసుకున్న సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రూరల్ ఎస్సు, పోలీస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి జిల్లా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహకారంతో ఆధారాలను సేకరించారు.
పోలీసుల వద్ద ఉన్న సాంకేతికత ఆధారంగా ఫింగర్ ప్రింట్ డాటా బేస్ మృతుని వేలిముద్రలను పోల్చగా మృతుడు గతంలో నేరస్తుడనీ, అతడు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కోనసీమ జిల్లా అమలాపురం మండలం చెందిన నాగవరపు సత్యనారాయణ ట సత్తిబాబుగా గుర్తించినట్లు తెలిపారు. బంధువులకు సమాచారం ఇవ్వగా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే మృతుడు 2023 సంవత్సరం జూలై నెల15వ తేదిన హైదరాబాద్, బోయినపల్లిలో బామర్ధి గెళ్లా కిరణ్ ఇంట్లో భార్య ఝాన్సీరాణితో గొడవపడి కత్తితో దాడి చేసి చంపి, బావమార్థి భార్య గల్లా షీలాను గాయపరిచిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఈనెల ఆరో తారీఖున జైలు నుంచి బెయిల్ పై విడుదలయాడన్నాడు.
అయితే ఈ కేసు విచారణలో కోర్ట్ లో సత్యనారాయణ కు వ్యతిరేకంగా కిరణ్, అతని బార్య , మిగతా సాక్షులు సాక్ష్యము చెప్పారన్నారు. దీంతో ఈనెల 7న కరక్కాయపేటకు వెళ్ళి కిరణ్ ఇంట్లో అద్దెకు ఉండే ఏ3 దొండపాటి విశ్వనాధంతో కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అందరినీ చంపుతాననీ బెదిరించాడన్నారు. ఈ విషయాన్ని విశ్వనాధం, కిరణ్ కు ఫోన్ లో తెలిపాడన్నారు. సత్యనారాయణ బ్రతికి ఉంటే తమని చంపుతాడనీ అందుకే ఏ1 కిరణ్, అతని పెద్దక్క ఏ6 చీకురుమిల్లీ అమ్మాజి, బావ ఏ2 చీకురుమిల్లీ మాధవరావు, వారి కొడుకు ఏ4 శశికుమార్ ట శశి, కూతురు ఏ5 మౌనిక, కిరణ్ మేనమామ ఏ7 నేతల సర్వేశ్వర రావు, కిరణ్ భార్య ఏ9 శీల, అతని ఇంట్లో అద్దెకు ఉండే విశ్వనాధం, ఏ8 గిడ్డి రమేష్ లు హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.
సత్యనారాయణ ఈ నెల 14న సికింద్రాబాద్ కోర్టుకు వాయిదాకు వెళ్ళగా అక్కడే అతన్ని బలవంతంగా కారులో గొంతు పై కాలు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారన్నారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై నుండి కారులో వచ్చి శవాన్ని పిల్లలమర్రి గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న కాలువలో వేసి గుర్తు పట్టకుండా యాసిడి పోసి విజయవాడకు వెళ్లారన్నారు. మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళి పోయారన్నారు. అయితే నేరస్తులందరినీ బుధవా రం పట్టుకున్నట్లు తెలిపారు.
వీరి నుండి నేరానికి ఉపయోగించిన ఎర్టీగా కారు, కీయా కారు, రెండు తాల్లు, ఒక క్లాత్, ఖాళీ యాసిడ్ క్యాన్, 10 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేయబడిన 9 మంది నిందితులపై గతంలో ఎలాంటి నేరచరిత్ర గుర్తించబడలేదనీ వివరించారు. ఈ కేసు చేదనలో బాగా పనిచేసినటువంటి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సిబ్బందిని, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ను, ఎస్‌ఐ బాలు నాయక్, పెనపహాడ్ ఎస్‌ఐ గోపి కృష్ణ ను, పర్యవేక్షణ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ ను, సిబ్బందిని అభినందించి రికార్డ్స్ అందించారు.