13-08-2025 12:00:00 AM
ఎస్పీ నరసింహ
సూర్యాపేట ఆగస్టు 12 (విజయక్రాంతి) : అధిక వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కే.నరసింహ అన్నారు. సూర్యాపేట రూరల్ పరిధి ఎదురువారిగూడెం - బీమారం వంతెన వద్ద మూసి నది ప్రవాహాన్ని మంగళవారం సిఐ రాజశేఖర్, ఎస్త్స్ర బాలు నాయక్, మూసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురుస్తున్నందున పోలీస్ సిబ్బంది మూసి ప్రాజెక్ట్ అధికారులతో సమన్వయంగా పని చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
అలాగే ఎప్పటికప్పుడు మూసి పరిస్థితిని అంచనా వేస్తూ మూసి పరివాహక గ్రామాల ప్రజలను జాగ్రత్త పరచాలని ఆదేశించారు. ప్రవాహ ఉదృతి ఉన్న నీటిలోకి దిగవద్దని, లోతు ఎక్కువగా ఉన్న నీటిలోకి వెళ్ళవద్దు అని చేపల వేటకు వెళ్ళవద్దు అని ఎస్పీ కోరారు, ప్రమాద తీవ్రత ఉన్న ప్రాంతాలలో పోలీసు సిబ్బందిని విధుల్లో ఏర్పాటు చేశామని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పోలీసు సూచనలు ప్రజలు పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 కు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ 8712686026 ఫోన్ చేసి పోలీసు సేవలు పొందవచ్చని సూచించారు.